అక్షరటుడే, ఆర్మూర్/కమ్మర్‌పల్లి : MLA Prashanth Reddy | క్రీడలతో మానసిక స్థైర్యం, నాయకత్వ లక్షణాలు అలవడుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని (Kammarpally Mandal) ఇండోర్ మైదానంలో జరుగుతున్న 69వ ఎస్‌జీఎఫ్ అంతర్ జిల్లాల సాఫ్ట్‌బాల్ అండర్-17 (బాలబాలికల) పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
MLA Prashanth Reddy | క్రీడల నిర్వహణకు ఎల్లప్పుడూ ముందుంటా..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల నిర్వహణలో ఎవరూ వెనకడుగు వేయవద్దని, తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కమ్మర్‌పల్లి లేదా వేల్పూర్ వేదికగా రాష్ట్రస్థాయి ఈవెంట్‌ను (State Level Event) నిర్వహించాలన్న ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఎక్కడ వీలైతే అక్కడ పెద్దఎత్తున టోర్నమెంట్లు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని మరే నియోజకవర్గంలో లేనివిధంగా బాల్కొండ నియోజకవర్గంలో రెండు ఇండోర్ స్టేడియంలు కమ్మర్‌పల్లి, వేల్పూర్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) సహకారంతో ఈ మౌలిక సదుపాయాలను కల్పించుకున్నామని, వీటిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
MLA Prashanth Reddy | నా తండ్రి గొప్ప క్రీడాకారుడు..
తన తండ్రి, స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గొప్ప క్రీడాకారుడని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఆయన జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడని, సీనియర్ నేషనల్స్ ఆడారని, అలాగే క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్ వంటి అన్ని క్రీడలలో రాణించారని తెలిపారు. విద్యాసాగర్ సూచించినట్లుగా, భవిష్యత్తులో సురేందర్ రెడ్డి మీద రాష్ట్రస్థాయి టోర్నమెంట్ నిర్వహించడానికి అసోసియేషన్ అధికారులు చొరవ తీసుకుంటే, దానికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, క్రీడా సంఘం బాధ్యులు సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ శోభన్, నిజామాబాద్ ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ నాగమణి, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, పీఈటీలు విద్యాసాగర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, నీరజ రెడ్డి, ఎంఈవో ఆంధ్రయ్య, తహశీల్దార్ సాయన్న, ఎంపీడీవో ప్రసాద్, రాష్ట్రస్థాయి పరిశీలకులు, సెలెక్టర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.