అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Wine Shops | రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల (Liquor Shops) టెండర్లకు స్పందన కరువైంది. ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాల కేటాయింపు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీ కోసం సెప్టెంబర్ 26న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదే రోజు నుంచి కొత్త దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి వ్యాపారులు, ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. అక్టోబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే దరఖాస్తు గడువు సమీపిస్తున్నా.. ఎక్కడ కూడా భారీ సంఖ్యలో దరఖాస్తులు నమోదు కాకపోవడం గమనార్హం. నోటిఫికేషన్ ప్రకారం. అక్టోబర్ 23న కొత్త దుకాణాల కేటాయింపు కోసం డ్రా తీస్తారు. అయితే అనుకున్నంత స్పందన రాకపోవడంతో దరఖాస్తు గడువు పొడిగిస్తారని ప్రచారం జరుగుతుంది. కాగా రాష్ట్రంలో డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం అవుతాయి.
Wine Shops | ఫీజు పెంచడంతో..
రాష్ట్రంలో ప్రతి సారి మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు వచ్చేవి. దరఖాస్తుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం (Income) సమకూరేది. దీంతో ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) దరఖాస్తు ఫీజును రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షలకు పెంచింది. దీంతో చాలా మంది అప్లై చేయడానికి ఆసక్తి చూపడం లేదు. గతంలో ఒక్కరే పదుల సంఖ్యలో వైన్ షాపులకు దరఖాస్తులు చేసేవారు. ఈ సారి అలాంటి ఘటనలు ఇంకా చోటు చేసుకోలేదు. ముఖ్యంగా మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైన్ షాపులకు స్పందన కరువైంది. జిల్లా కేంద్రాలు, ప్రధాన ప్రాంతాల్లో ఉండే మద్యం దుకాణాలకు దరఖాస్తులు వస్తున్నా.. మిగతా వాటికి మాత్రం ఆశించినంత స్పందన రావడం లేదు.
Wine Shops | ఫోన్లు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు
మద్యం దుకాణాలకు స్పందన లేకపోవడంతో ఎక్సైజ్ అధికారులు (Excise Officers) తలలు పట్టుకుంటున్నారు. దరఖాస్తు ఫీజు పెంచడంతో ఆదాయం ఎక్కువ వస్తుందని ప్రభుత్వం భావించింది. అయితే ఎవరు ఆసక్తి చూపకపోవడంతో ఆదాయం రావడం లేదు. దీంతో ఎక్సైజ్ అధికారులు గతంలో ప్రస్తుతం మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వారికి ఫోన్లు చేసి మరి దరఖాస్తులు చేసుకోవాలని కోరుతున్నారు. అలాగే గతంలో టెండర్లు వేసినవారికి సైతం ఫోన్లు చేస్తున్నారు. కాగా.. టెండర్లకు మరో వారం రోజుల సమయం ఉంది. అప్పటిలోగా దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.
Wine Shops | పలు జిల్లాల్లో వచ్చిన దరఖాస్తులు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో గతంలో వేల సంఖ్యలో దరఖాస్లు వచ్చాయి. 2023లో 8,128 దరఖాస్తులు రాగా ప్రస్తుతం శనివారం సాయంత్రం వరకు 278 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. దీంతో వారం రోజుల్లో ఎంత పెరిగిన గతేడాది రికార్డును చేరుకోవడం అసాధ్యం. నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో 102 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పటి వరకు 149 దరఖాస్తులు వచ్చాయి. కామారెడ్డి (Kamareddy)లో 49 దుకాణాలకు 106 అప్లికేషన్లు వచ్చాయి. కొమురం భీమ్ జిల్లాలో 32 దుకాణాలు ఉండగా.. శుక్రవారం సాయంత్రం వరకు 49 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.