అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACP Suspended | హైదరాబాద్ నగరంలో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. కుల్సుంపుర (Kulsumpura) ఏసీపీ మునావర్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించడం, అక్రమాలకు పాల్పడుతున్న పోలీసులపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా కుల్సుంపుర ఏసీపీ మునావర్‌పై వేటు వేశారు. ఆయనపై అవినీతి, భూ వివాదాలు, కేసుల తారుమారు ఆరోపణలు వచ్చాయి. పోలీస్ స్టేషన్ల (Police Stations) వారీగా వసూళ్లకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. సిబ్బందిని అవమానించే వ్యవహారంపై సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో అంతర్గత విచారణ చేపట్టి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు.
ACP Suspended | ఇటీవల సీఐ
కుల్సుంపుర ఠాణా సీఐ సునీల్‌ను మూడు రోజుల క్రితం సీపీ సస్పెండ్ చేశారు. సీఐ సునీల్ ఓ కేసులో నిందితుల పేర్లు మార్చాడు. నిందితులకు అనుకూలంగా వ్యవహరించాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు అంతర్గత విచారణ చేపట్టారు. డబ్బులు తీసుకొని నిందితుల పేర్లు మార్చారని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్‌లో టప్పాచబుత్రా సీఐ అభిలాష్ (CI Abhilash)ను సస్పెండ్ చేశారు. ఇటీవల ఓ నిందితుడి ఇంట్లో రోలాక్స్ వాచ్ కొట్టేసిన కానిస్టేబుల్‌పై వేటు వేశారు. మెహదీపట్నం ఠాణాలోని లాకర్ నుంచి ఖరీదైన ఫోన్‌ను చోరీ చేసిన పోలీస్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ACP Suspended | పోలీసుల్లో భయం
నగర పోలీస్ బాస్ చర్యలతో సిబ్బందిలో భయం మొదలైంది. సీపీ సజ్జనార్ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై వేటు వేస్తుండటంతో పలువురు పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తమ బండారం బయట పడుతుందోనని కలవర పడుతున్నారు. వరుస సస్పెన్షన్లపై శాఖలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.