అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phone tapping | ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు సిట్ నోటీసులు (SIT Notice) ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు.
కార్తీక దీపం సీరియల్ కూడా ముగిసింది కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు ముగియడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఎలా చెబితే సిట్ అలా చేస్తుందన్నారు. పాలన చేతకాక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి అసమర్థుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిపాలన చేతకాక విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్మూలా ఈ రేసు విచారణ పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
Phone tapping | ప్రతి ప్రభుత్వం చేసేదే!
ప్రతి ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా సమాచారం సేకరిస్తుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తోందన్నారు. ఆ విషయం పోలీసులకు సైతం తెలుసని పేర్కొన్నారు. ప్రభుత్వం రోటిన్‌గా జరిగే ప్రక్రియ ఫోన్ ట్యాపింగ్ అన్నారు. అది పోలీసులు చేసే పని అని, దానికి తమకు సంబంధం ఉండొదన్నారు. తన ఫోన్ ట్యాప్ అవుతుందో లేదో సిట్‌ను అడుగుతానన్నారు. ఫోన్ ట్యాపింగ్ పోలీస్ వ్యవస్థ చేస్తుందన్నారు. అది కూడా చట్ట ప్రకారం చేస్తారని చెప్పారు. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌లో ఉన్నారని గుర్తు చేశారు. ఆయనకు తెలియకుండానే ట్యాపింగ్ జరిగిందా అని ప్రశ్నించారు. ఆయనను ఎందుకు విచారణకు పిలవడం లేదన్నారు.
Phone tapping | రేవంత్‌రెడ్డి లీకువీరుడు
రేవంత్‌రెడ్డి పేరు లీకువీరుడు అని పెట్టాలని కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక్క అధికారి అఫిషియల్‌గా ప్రకటన చేశారా అని ప్రశ్నించారు. ఒక్క మంత్రి అయినా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు చెప్పారా అని అడిగారు. రేవంత్‌రెడ్డి లీక్‌ల ద్వారా వార్తలు రాయిస్తూ టైం పాస్ చేస్తున్నారని మండిపడ్డారు. సిట్ అధికారులు హరీశ్‌రావును అడిగిందే అడిగి టైంపాస్ చేశారని చెప్పారు. రేపు తనతో కూడా అదే చేస్తారన్నారు. కేసు విచారణ ప్రారంభించి రెండేళ్లు అవుతోందని, సిట్ దర్యాప్తుకు లీకులు తప్ప, అధికారిక ప్రకటన లేదన్నారు. ముఖ్యమంత్రి విదేశాల నుంచి వచ్చే వరకు టైంపాస్ చేసేందుకే విచారణకు పిలుస్తున్నారని పేర్కొన్నారు.
Phone tapping | జిల్లాల రద్దుకు కుట్ర
గతంలో తాము జిల్లాలు అశాస్త్రీయంగా చేశామని ప్రభుత్వం చెబుతోందన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేయడమే దీని ఎజెండా అని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల (Siricilla), పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కేసీఆర్ ప్రజల సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వాటిని తొలిగిస్తే ప్రజల చేతిలో చావు దెబ్బ తప్పదని హెచ్చరించారు.
Phone tapping | వాటిపై సిట్ వేయాలి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు గుండాలతో కలిసి భూ కబ్జాలు చేస్తుంటే దాని మీద సిట్ ఎందుకు వేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు కుంభకోణాన్ని బయటపెడితే దాని మీద ఎలాంటి విచారణ లేదన్నారు. వీటిపై సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Phone tapping | బీఆర్‌ఎస్‌దే విజయం
మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని మాజీ మంత్రి ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాధించామో.. అంతకు మెరుగైన ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లో వస్తాయన్నారు. ఓటమి తప్పదని అర్థమై జిల్లా పరిషత్ ఎన్నికలకు ప్రభుత్వం దూరంగా ఉందని విమర్శించారు.