అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒక లొట్టపీసు కేసని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడారు. విచారణలు, కమిషన్ల పేరుతో తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ వేధింపులలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారన్నారు.
KTR | భయపడేది లేదు
ఇది సిట్ విచారణ కాదని,చిట్టి నాయుడి విచారణ అని కేటీఆర్ అన్నారు. ఇంకో 1,000 సిట్లు వేసినా.. భయపడేది లేదన్నారు. రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టమని చెప్పారు. హరీష్ రావు శాసనసభలో మంత్రులనే ఫుట్ బాల్ ఆడారని, ఆయనను నలుగురు, ఐదుగురు పోలీసులు ముందు కూర్చోపెడితే ఏం ఫరక్ పడుతుందన్నారు.
KTR | సింగరేణిలో రాజకీయ జోక్యం
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి (Singareni)లో రాజకీయ జోక్యం లేదని కేటీఆర్ తెలిపారు. కానీ కాంగ్రెస్ సింగరేణిని బంగారు బాతులా చూస్తుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి గ్యాంగ్ సింగరేణిలో ఏడు టెండర్లు తీసుకున్నట్లు ఆరోపించారు. సైట్ విసిట్ సర్టిఫికెట్ అనే అడ్డమైన విధానంతో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బావమరిది గ్యాంగ్ టెండర్లు దక్కించుకుందన్నారు. రేవంత్‌రెడ్డి అవినీతిని బయటపెట్టిన ప్రతిసారీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇంకెన్ని రోజులు లీకుల మీద బతుకుతారని ప్రశ్నించారు.
KTR | అధికారులను వదిలిపెట్టం
ఒక మీడియా సంస్థ ఏదో రాసిందని దానిపై సిట్ విచారణ వేశారని కేటీఆర్ అన్నారు. ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇన్ని కుంభకోణాలు జరుగుతుంటే SIT వేయరా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాట విని అధికారులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి అధికారులను ఎవరినీ వదిలిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు.