అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరు అయ్యారు. ఉదయం 11 గంటలకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ (Jubilee Hills Police Station)కు చేరుకున్నారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ అధికారులు గురువారం కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావును అధికారులు మంగళవారం విచారించారు. ఏడు గంటల పాటు ప్రశ్నించారు. తాజాగా కేటీఆర్‌ను విచారిస్తున్నారు. ఆయన తన నివాసం నుంచి ముందుగా తెలంగాణ భవన్ (Telangana Bhavan)కు చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం సిట్ విచారణకు వచ్చారు.
KTR | భారీ భద్రత
కేటీఆర్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే కేటీఆర్ ఒక్కరినే పోలీసులు లోనికి అనుమతించారు. తమను అనుమతించాలని బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) పోలీసులతో వాగ్వాదం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల వైఖరిని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ జూబ్లీహిల్స్‌లో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, క్రాంతి కిరణ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
హరీశ్‌రావు (Harish Rao) మాట్లాడుతూ.. కావాలని రిటైర్మెంట్‌కు దగ్గర ఉన్న అధికారులతో SIT ఏర్పాటు చేసి తమను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి మాటలు, సీపీ మాటలు విని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా రప్పిస్తామన్నారు.