అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Korean Kanakaraju | మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన సినిమాల ఎంపికతో గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్ (Varun Tej), ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు మేర్లపాక గాంధీ (Director Merlapaka Gandhi) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే వినూత్నమైన టైటిల్‌ను ఖరారు చేయడం ప్రత్యేక చర్చకు దారి తీసింది.
Korean Kanakaraju | టైటిల్‌తోనే క్యూరియాసిటీ
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ‘కనకరాజు’ అనే పాత్రలో కనిపించనున్నారు. గ్లింప్స్‌లో ఆయన కొరియన్ భాష (Korean Language)లో “నేను తిరిగొచ్చేశా” అంటూ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. కథ పూర్తిగా ఏ దిశలో సాగుతుందో చెప్పకపోయినా, చూపించిన విజువల్స్ మాత్రం ఇది రొటీన్ కమర్షియల్ సినిమాకి భిన్నంగా ఉండబోతుందనే సంకేతాలను ఇచ్చాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ టోన్ చూసినవారికి హారర్–కామెడీ–ఫాంటసీ అంశాలు బలంగా ఉండనున్నాయన్న అంచనా ఏర్పడింది. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత వరుణ్ తేజ్ మాస్ పాత్రలకు కొంత దూరంగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఆయన కత్తి పట్టుకుని పవర్‌ఫుల్ ఎంట్రీ ఇవ్వడం, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్ చూపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల వరుసగా సరైన విజయాలు లేక ఇమేజ్, మార్కెట్ పరంగా ఒత్తిడిని ఎదుర్కొన్న వరుణ్ తేజ్‌కు ఈ ప్రాజెక్ట్ చాలా కీలకంగా మారింది. అందుకే ఈ సినిమాను ఆయన కంబ్యాక్ మూవీగా చూస్తున్నారు.
గ్లింప్స్ ప్రకారం కథలో కొరియా బ్యాక్‌డ్రాప్ కీలకంగా కనిపిస్తోంది. అక్కడ చిక్కుకున్న సత్య పాత్రను పోలీసులు ప్రశ్నించడం, ‘కనకరాజు’ గురించి సమాచారం కోరడం, ఆ వెంటనే భయానకంగా హీరో ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిని పెంచుతోంది. కానీ చివర్లో అతను అసలు కనకరాజు కాదేమో అన్న ట్విస్ట్ ఇవ్వడంతో కథపై మరింత ఉత్కంఠ పెరిగింది. అసలు నిజం ఏంటి? దెయ్యం కాన్సెప్ట్ వెనుక కథ ఏమిటి? అన్నది ట్రైలర్ వచ్చే వరకూ సస్పెన్స్‌గానే ఉంచుతున్నారు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా, ‘మిరాయ్’ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు ప్రధాన బలంగా నిలిచింది. సింపుల్ విజువల్స్ అయినా, బీజీఎం మాత్రం హారర్ ఫీల్‌ను బలంగా తీసుకొచ్చింది.