అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kokapet Lands | హైదరాబాద్ నగర శివారులోని కోకాపేట భూములు (Kokapet Lands) హాట్ కేక్‌ల్లా అమ్ముడు పోతున్నాయి. కోట్లు పెట్టి ఇక్కడ భూమిని కొనుగోలు చేయడానికి సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన వేలంలో రికార్డు ధర పలకగా.. తాజాగా ఎకరం రూ.131 కోట్లు పలికింది.
కోకాపేటలోని నియోపాలిస్ భూములకు (Neopolis landsమూడో విడత వేలం ప్రక్రియ బుధవారం ముగిసింది. ప్లాట్ నంబర్ 19, 20ల్లోని భూములకు అధికారులు ఆన్లైన్లో వేలం నిర్వహించారు. ప్లాట్ నెంబర్ 19లో ఎకరా రూ.131 కోట్ల చొప్పున యులా కన్స్ట్రక్షన్స్ & గ్లోబస్ ఇన్‌ఫ్రాకాన్ దక్కించుకుంది. ప్లాట్ నెంబర్ 20లో ఎకరా రూ.118 కోట్ల చొప్పున బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ వేలం పాడింది. మొత్తం 8.04 ఎకరాలకు వేలం నిర్వహించగా.. ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల మేర ఆదాయం సమకూరింది.
Kokapet Lands | మూడు దశల్లో..
కోకాపేటలోని నియోపాలిస్ లే అవుట్లో (Neopolis Layout) భూములకు అధికారులు మూడు విడతల్లో వేలం నిర్వహించారు. నవంబర్ 24న ప్లాట్ నంబర్ 17, 18లోని భూములకు ప్రభుత్వం వేలం వేసింది. ప్లాట్ నం.17లోని భూమి ఎకరం ఏకంగా రూ.137.25 కోట్లు పలికింది. 18లో 5.31 ఎకరాల భూమి ఉంది. మొత్తం 9.9 ఎకరాలకు 1,355.33 కోట్లు ధర పలికింది. నవంబర్ 28న రెండో దశ వేలం నిర్వహించారు. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు జీహెచ్ఆర్ సంస్థ దక్కించుకుంది. 16వ ప్లాట్లోని భూమిని ఎకరాకు రూ.147.75 కోట్లకు చొప్పున గోద్రెజ్ సంస్థ కొనుగోలు చేసింది. మొత్తం మూడు విడతల్లో కలిసి 27 ఎకరాలకు విక్రయించగా.. ప్రభుత్వానికి రూ.3,708 ఆదాయం వచ్చింది.
Kokapet Lands | 5న మళ్లీ వేలం..
ఈ నెల 5న మరోసారి హెచ్ఎండీఏ అధికారులు (HMDA officials) వేలం పాట నిర్వహించనున్నారు. కోకాపేట గోల్డెన్ మైల్‌లోని 2 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలకు ఈ-వేలం జరగనుంది. దీంతో అందరి దృష్టి ఆ భూములపై ఉంది.
