అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TET Coaching | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఇటీవల టెట్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 29 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రస్తుతం అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే వారి కోసం ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ (Online Coaching) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
టెట్ అభ్యర్థుల ప్రయోజనం కోసం ప్రభుత్వం టీసాట్ (TSAT) ద్వారా డిజిటల్ ఉచిత కోచింగ్‌ను ప్రారంభించింది. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. నవంబర్ 19న టెట్ కోసం లైవ్ ఓరియంటేషన్ సెషన్‌లు (Live Orientation Session) నిర్వహిస్తారు. అనంతరం 200 ఎపిసోడ్‌లను కవర్ చేస్తూ 44 రోజుల నిరంతర కోచింగ్ ఉంటుంది. టీ సాట్ నిపుణ ఛానెల్‌లో ప్రత్యేక తరగతులు ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రసారం అవుతాయి. T-SAT విద్యా ఛానెల్‌లో రోజువారీ సెషన్‌లు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు నిర్వహిస్తారు. టెట్ అభ్యర్థులకు ప్రతిరోజూ మొత్తం 4 గంటల ప్రత్యేక ప్రసారం అందుబాటులో ఉంటుంది.
TET Coaching | సద్వినియోగం చేసుకోవాలి
డిజిటల్ పాఠాలు చైల్డ్ డెవలప్‌మెంట్, పెడాలజీ, సైకాలజీ, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ అలాగే ఇంగ్లిష్, తెలుగు, ఇతర అవసరమైన సబ్జెక్టులతో సహా ముఖ్యమైన TET సబ్జెక్టులను కవర్ చేస్తాయి. TET పేపర్ 1, పేపర్ 2 కి హాజరయ్యే అభ్యర్థులు T-SAT ప్రసారాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. టెట్ ప్రత్యేక కోచింగ్ కంటెంట్ T-SAT ఉపగ్రహ ఛానెల్‌లు, T-SAT మొబైల్ యాప్, యూట్యూబ్ చానెల్ (You Tube Channel) అందుబాటులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
TET Coaching | జనవరిలో పరీక్షలు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని చెప్పింది. ఈ మేరకు గత డిసెంబర్, జూన్‌లో పరీక్షలు పెట్టింది. తాజాగా మరోసారి షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు పెట్టనున్నారు.
