అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Loan Apps | కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. 87 అనధికార లోన్ యాప్స్‌పై నిషేధం విధించింది. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలను వేధిస్తున్న యాప్స్‌పై చర్యలు చేపట్టింది.
సైబర్ మోసాలు (Cyber Frauds), వేధింపులు, వడ్డీ దోపిడీలపై తరుచూ ఫిర్యాదులు వస్తుండటంతో కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ లోన్ యాప్స్‌పై కేంద్ర పర్యవేక్షణను ఇంకా కఠినతరం చేయనున్నట్లు సమాచారం. ఆర్బీఐ, ఐటీ మంత్రిత్వ శాఖ (IT Ministry) కలిసి లోన్ యాప్స్‌పై సమగ్ర సమీక్ష అనంతరం నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఐటీ చట్టం 2000 ప్రకారం యాప్స్ బ్యాన్ చేసిటన్లు కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్‌సభలో తెలిపారు.
Loan Apps | అధిక వడ్డీ
దేశంలో అనేక లోన్ యాప్‌లు పుట్టుకొచ్చాయి. ఆర్బీఐ (RBI) నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే చాలా వరకు లోన్ యాప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు ఇన్‌స్టాంట్‌గా ఇవి అప్పులు ఇస్తున్నాయి. అత్యవసరం అయిన ప్రజలు వీటి ద్వారా లోన్ తీసుకొని తర్వాత చిక్కుల్లో పడుతున్నారు. ఈ యాప్‌ల్లో అధిక వడ్డీకి లోన్లు ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నెలకు 20 శాతం వడ్డీ వసూలు చేస్తుండటం గమనార్హం. దీంతో చాలా మంది చేసిన అప్పులు కట్టలేక అవస్థలు పడుతున్నారు. అయితే అప్పులు కట్టకపోతే సదరు లోన్ యాప్ వారు వేధింపులకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత డేటాను సేకరించి బెదిరిస్తున్నారు. వినియోగదారుల వేధింపులు, డేటాను అనధికారికంగా ఉపయోగించడం, వ్యక్తిగత డేటాను దొంగిలించడం, బ్లాక్‌మెయిల్ కూడా ఆరోపణలు ఉన్నాయి. రుణాలను తిరిగి చెల్లించని వ్యక్తుల చిత్రాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రం చర్యలు చేపట్టింది. 87 అనధికార యాప్స్‌పై నిషేధం విధించింది.
