అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Modi-Putin | భారత్–రష్యా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ, పుతిన్ హైదరాబాద్ హౌజ్ (Hyderabad House)లో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.
భారత్–రష్యా (India–Russia) మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఒప్పందాలపై సంతకాలు చేపట్టినట్లు నేతలు తెలిపారు. ఆహార భద్రత, ఆరోగ్య రంగం, లేబర్ మైగ్రేషన్ మొబిలిటీ, పోర్టులు, నౌకాయానంపై ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, రష్యా మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుందన్నారు. రష్యా మనకు ఎప్పటి నుంచో మిత్రదేశం.. భారత్ వాణిజ్యానికి రష్యా అండగా నిలుస్తోందన్నారు. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతాయని ఆకాంక్షించారు. 2030 వరకు ఆర్థిక సహకార అంశాలపై అంగీకారం కుదిరిందన్నారు.
Modi-Putin | భారత్‌కు సహకరిస్తాం
అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు పుతిన్ తెలిపారు. భారత్- రష్యా మధ్య స్వేచ్ఛా వాణిజ్య జోన్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భారత ఇంధన రంగ అభివృద్ధికి కావాల్సిన చమురు, గ్యాస్, బొగ్గు అంశాల్లో సహకారానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తనకు అపూర్వ స్వాగతం పలికిన భారతీయులందరికీ, ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Modi-Putin | కలిసి పనిచేస్తాం
మోదీ (PM Modi) నివాసంలో ఆతిథ్యం సంతోషం కలిగించిందని పుతిన్ తెలిపారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వ్యాపారం తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య 64 బిలియన్ డాలర్ల ట్రేడ్ ఉన్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ప్రాజెక్ట్‌లు, టెక్నాలజీ అభివృద్ధిలో పరస్పరం సహకారం అందించుకుంటామని చెప్పారు. కుడంకుళం అణువిద్యుత్ కేంద్రం విషయంలో భారత్‌కు సహకారం అందిస్తున్నామని చెప్పారు. వైద్య, ఆరోగ్య రంగంలో కలిసి పనిచేస్తామని పుతిన్ పేర్కొన్నారు. మేకిన్ ఇండియా (Make in India)కు తమ మద్దతు ఉంటుందన్నారు. వచ్చే ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం జరుగుతుందని వెల్లడించారు.
