అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sarpanch Elections | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) దత్తత గ్రామాలైన సిద్ధిపేట జిల్లా (Siddipet District) మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట పంచాయతీలు మరోసారి అభివృద్ధి–ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయి.
రెండు గ్రామాల్లో కూడా సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు కాగా, గ్రామంలో ఐక్యతను కాపాడాలని స్థానిక పెద్దలు, గ్రామస్థులు నిర్ణయించడంతో వివిధ పార్టీల నుండి నిలబడ్డ అభ్యర్థులు స్వచ్ఛందంగా పోటీ నుంచి వైదొలిగారు. దీంతో రెండు గ్రామాల్లోనూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఖరారయ్యాయి.
Sarpanch Elections | ఎర్రవల్లిలో మళ్లీ ..
కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవల్లి గ్రామం (Erravalli Village) గతంలోనే ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చెందింది. ఈసారి కూడా గ్రామ ప్రజలు ఒకే అభిప్రాయంతో నారన్నగారి కవిత రామ్మోహన్‌రెడ్డి పేరును సర్పంచ్‌గా ఏకగ్రీవంగా తేల్చారు. నారన్నగారి కవిత రామ్మోహన్‌రెడ్డి సర్పంచ్ కాగా, ఉప సర్పంచ్ ఎడమ సబిత కరుణాకర్, వార్డ్ సభ్యులలో ఎనిమిది స్థానాలన్నీ ఏకగ్రీవం. ఇప్పటికే సర్పంచ్‌గా సేవలందించిన కవిత రామ్మోహన్‌రెడ్డి, కేసీఆర్ (KCR) మార్గదర్శకత్వంలో గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. మళ్లీ ఏకగ్రీవ ఎన్నికతో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి వీలు ఏర్పడింది.
నర్సన్నపేట పంచాయతీ సర్పంచ్‌గా గిలక బాల్ నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మొత్తం 8 వార్డుల్లో 4 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 4 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఈ వివరాలను రిటర్నింగ్ అధికారిణి సరోజ అధికారికంగా ధృవీకరించారు. ఏకగ్రీవ ఫలితాలను డిసెంబర్ 11న అధికారికంగా ప్రకటించనున్నారు.మరోవైపు ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం గ్రామ పంచాయతీ, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) స్వగ్రామం కాగా, ఈ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉండగా, ఎమ్మెల్యే రాందాస్, ఇతర స్థానిక నాయకులు గ్రామ అభివృద్ధి, ఐక్యతను దృష్టిలో ఉంచుకొని చర్చలు జరిపారు. ఫలితంగా అందరూ సమ్మతించి, నూతి వెంకటేశ్వరరావును సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.గ్రామంలోని ఎనిమిది వార్డులూ ఏకగ్రీవం కావడం ఈ ఎన్నికల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
