అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kalvakuntla Kavitha | రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) తాము పోటీ చేయబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదన్నారు.
జాగృతి మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా కవిత క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా కవిత నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సత్యనారాయణ రాసిన పాటలు ఆంధ్రా పాలకులకు తూటాలై తగిలాయని చెప్పారు. 1952 ముల్కీ ఉద్యమాన్ని మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ముచ్చర్ల సత్యనారాయణ పోరాటం చేశారన్నారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Kalvakuntla Kavitha | బీసీలకు అన్యాయం
పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) బీసీలకు అన్యాయం జరిగిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే ఎన్నికలు పెట్టారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) గురించి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడటం లేదన్నారు. దీనిపై బీసీలు మాట్లాడుతారని అనుమానం రాగానే.. గుంపు మేస్త్రీ, గుంట నక్క గారిని విచారణకు పిలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి (Revanth Reddy), హరీశ్‌రావు (Harish Rao) కలిసే ఉన్నారన్నారు. ప్రజలను మభ్య పెట్టడానికి విచారణ పేరిట డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల గురించి బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జనరల్ స్థానాల్లో సైతం బీసీలు పోటీ చేయాలని ఆమె సూచించారు. ఎన్నికల్లో జాగృతి పోటీ చేయదు అన్నారు. కానీ తమను కలిసిన వారికి మద్దతు ఇస్తామని ప్రకటించారు.
Kalvakuntla Kavitha | అధికారంలోకి వస్తాం
బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన అమర జ్యోతిలో అవినీతి జరిగిందని కవిత ఆరోపించారు. దానిని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీసం ఒక్కసారి వెళ్లి నివాళులు అర్పించలేదన్నారు. తెలంగాణలో జాగృతి అధికారంలోకి వస్తుందని కవిత అన్నారు. అప్పుడు శ్రీకాంతాచారి జయంతి, వర్ధంతిని అమరజ్యోతిలో జరుపుతామని చెప్పారు. సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సికింద్రాబాద్ జిల్లా కోసం పోరాడిన వారిని అణిచివేశారని, జైలులో పెట్టారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.