అక్షరటుడే, వెబ్‌డెస్క్: TVK Chief Vijay | కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ (actor Vijay) విచారణ ముగిసింది. సోమవారం సుమారు 6 గంటలపాటు సీబీఐ అధికారులు (CBI officials) ఆయనను ప్రశ్నించారు.
విజయ్ గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకొని 41 మంది చనిపోయారు. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఇటీవల విజయ్ను అధికారులు విచారించారు. ఆ సమయంలో సాక్షిగా పలు విచారించిన అధికారులు, తాజాగా అనుమానితుడిగా ప్రశ్నించారు. జనవరి 12న ఆయన్ను ఆరు గంటల పాటు విచారించారు. జనవరి 13న మళ్లీ హాజరు కావాలని కోరినప్పటికీ, పొంగల్ కారణంగా ఆయన మరో తేదీని కోరారని అధికారులు తెలిపారు. దీంతో సోమవారం విచారించారు.
TVK Chief Vijay | సహకరిస్తాం
ర్యాలీకి సంబంధించిన నిర్ణయాలు, విజయ్ ఆలస్యంగా రావడానికి గల కారణాలను అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. అలాగే తొక్కిసలాట (stampede) చోటు చేసుకున్నా.. విజయ్ తన ప్రసంగాన్ని అలాగే కొనసాగించారు. దీనిపై సైతం అధికారులు ప్రశ్నించారు. టీవీకే పార్టీ నాయకుడు నిర్మల్ కుమార్ సీబీఐ ఆఫీస్ బయట మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ దర్యాప్తునకు సహకరిస్తోందని తెలిపారు. తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేయొద్దని కోరారు. మరోసారి విచారణకు విజయ్ను పిలువలేదన్నారు. కాగా ఈ ఘటనపై ఫిబ్రవరి రెండోవారంలో విజయ్ పేరుతో సీబీఐ ఛార్జిషీట్ వేయనున్నట్లు సమాచారం.