అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karur Stampede | తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇటీవల కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మృతి చెందారు. కాగా దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని టీవీఏ పార్టీ వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది.
తొక్కిసలాట అనంతరం ఇందులో కుట్రకోణం ఉందని టీవీకే ఆరోపించిన విషయం తెలిసిందే. పోలీసులు లాఠీచార్జీ చేయడంతోనే తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు ఆ పార్టీ పేర్కొంది. అయితే ఆ ఆరోపణలను తమిళనాడు పోలీసులు ఖండించారు. అయితే ఈ ఘటనపై తమిళనాడు(Tamil Nadu) పోలీసులతో కాకుండా సీబీఐ విచారణ జరిపించాలని విజయ్ పార్టీ హైకోర్టు(High Court)లో పిటిషన్ వేసింది. దీనిపై శుక్రవారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు విజయ్(Vijay Thalapathy) పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
Karur Stampede | రాజకీయ వేదికలుగా మార్చొదు
కరూర్(Karur Stampede) ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభదశలోనే ఉందని కోర్టు పేర్కొంది. ఈ సమయంలో సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదని తెలిపింది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని హెచ్చరించింది. అలాగే బీజేపీ న్యాయవాది జీఎస్ మణి సైతం సీబీఐ విచారణ కోరుతు పిటిషన్ వేయగా కోర్టు కొట్టి వేసింది. అలాగే టీవీకే నామక్కల్ జిల్లా కార్యదర్శి సతీష్‌కుమార్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు తోసిపుచ్చింది. ర్యాలీ సమయంలో జన సమూహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని జడ్జి ఆయన తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు.
Karur Stampede | కీలక సూచనలు
విచారణ సందర్భంగా పార్టీలకు కోర్టు కీలక సూచనలు చేసింది. బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు, అంబులెన్స్ సౌకర్యం, ప్రజలు బయటకు వెళ్లే మార్గం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ సందర్భంగా నిబంధనలు రూపొందించే వరకు రహదారులపై పార్టీ సభలకు పోలీసులు అనుమతులు ఇవ్వరని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.