అక్షరటుడే, కామారెడ్డి: Municipal Elections | కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) తుది ఓటరు జాబితాను సోమవారం సాయంత్రం మున్సిపల్ అధికారులు విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల (municipal elections) నేపథ్యంలో కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన ఓటరు జాబితాపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఓటర్ల తారుమారు, ఇతర గ్రామాల నుంచి పట్టణ ఓటరు జాబితాలో చేర్చారని, దొంగ ఓట్ల అంశం తీవ్ర చర్చకు దారి తీయగా బీజేపీ మాజీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు.
Municipal Elections | 128 అభ్యంతరాలు రాగా..
రాజకీయ పార్టీల (political parties) నుంచి ఆదివారం వరకు 128 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సరిచేయడానికి అధికారులు తీవ్ర కసరత్తులు చేశారు. జాబితా సవరణకు ముందు 49 వార్డుల్లో పట్టణ ఓటర్లు 99,555 ఉండగా ఇందులో 48,511 మంది పురుషులు, 51,027 మంది మహిళలు 17 మంది ఇతరులు ఉన్నారు. ఓటరు జాబితా సవరణ అనంతరం సోమవారం విడుదల చేసిన తుది జాబితాలో మొత్తం ఓటర్లు 99,313 ఉన్నారు.
ఇందులో పురుషులు 50,907, మహిళలు 48,389, ఇతరులు 17 మంది ఉన్నారు. పాత ఓటరు జాబితా తుది ఓటరు జాబితా పరిశీలిస్తే 242 మందిని ఓటరు జాబితా నుంచి తొలగించినట్టుగా తెలుస్తోంది. ఇందులో 120 మంది పురుషులు, 122 మందిని తొలగించారు. మొత్తం 49 వార్డులలో అత్యధికంగా 25 వ వార్డులో 2,535, 35వ వార్డులో 2,529 మంది ఉండగా ఆత్యల్పంగా 2వ వార్డులో 1,600 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఓటరు తుది జాబితా వివరాలు విడుదల చేసిన అధికారులు ఈనెల 16న ఫొటోలతో సహా పూర్తిస్థాయిలో ఓటరు జాబితా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.