అక్షరటుడే, కామారెడ్డి: Ayyappa Thiruvabharana Seva | శబరిమల అయ్యప్ప స్వామికి అలంకరించే తిరువాభరణ సేవలో కామారెడ్డి జిల్లా (Kamareddy district) వాసులకు అవకాశం లభించింది. జిల్లాలోని గాంధారికి (Gandhar) చెందిన కులకర్ణి చక్రధర్, అంజాగౌడ్ స్వామి, కొక్కొండ మహేశ్వర్, రాజేశ్వర్ లకు తిరువాభరణ సేవలో పాల్గొనే అదృష్టం వరించింది.
Ayyappa Thiruvabharana Seva | 12 నుంచి తిరువాభరణ పాదయాత్ర
ప్రతి ఏడాది జనవరి 12 నుంచి 14 వరకు తిరువాభరణ పాదయాత్ర (Thiruvabharana foot pilgrimage) కొనసాగుతుంది. సంక్రాంతి రోజు శబరిమల (Sabarimala) అయ్యప్ప మకర సంక్రాంతి రోజు మూడుసార్లు జ్యోతి రూపంలో దర్శనం ఇస్తారు. అంతకు ముందు పందలం రాజ్యం నుండి అయ్యప్ప తిరువాభరణాలను సుమారు 80 కిలోమీటర్లు కాలినడకన శబరిమల తీసుకువచ్చి స్వామి వారికి అలంకరిస్తారు. ఈ పాదయాత్రలో పందల రాజ వంశీయులతో పాటు ప్రతి ఏడాది కొందరికి అవకాశం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది.
Ayyappa Thiruvabharana Seva | 4వేల మందికి దేవస్థానం అవకాశం
ఈసారి సుమారు 4 వేల మందికి దేవస్థానం బోర్డు అవకాశం ఇచ్చింది. దేశవ్యాప్తంగా వేలాదిగా దరఖాస్తులు రాగా అందులో కామారెడ్డి శ్రీశాస్త అన్నదాన ట్రస్ట్ సభ్యులైన నలుగురికి అదృష్టం వరించింది. ఈ సందర్భంగా తిరువాభరణ సేవలో పాల్గొన్న భక్తులు చక్రధర్, అంజాగౌడ్ స్వామి, మహేశ్వర్, రాజేశ్వర్ మాట్లాడుతూ.. ఎన్నో జన్మల పుణ్యఫలం కారణంగా తమకు ఈ అవకాశం లభించినట్లు తెలిపారు. ఈ సేవలో పాల్గొనేలా ప్రోత్సహించి, పందల రాజు వారితో స్వయంగా మాట్లాడిన నాచారం పీఠాధిపతి మదుసూధానానంద సరస్వతి స్వామికి, శ్రీ శాస్త అన్నదాన సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షులు గుడిపాటి చంద్రశేఖర్ శర్మ గురుస్వామికి ధన్యవాదాలు తెలిపారు.