అక్షరటుడే, కామారెడ్డి : Minister Seethakka | పట్టణంలో ఈనెల 15న నిర్వహించాలనుకున్న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేసినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. మాచారెడ్డి, పాల్వంచ మండల కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో ఆమె మాట్లాడారు.
బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ (BC Decleration) ప్రకటించామని వివరించారు. బీసీ బిల్లుకు అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. బిల్లును ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపడం జరిగిందన్నారు.
Minister Seethakka | హామీని నిలబెట్టుకున్నాం..
బీసీ రిజర్వేషన్‌పై ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సందర్భంలో కామారెడ్డిలో (Kamareddy) భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని సీతక్క తెలిపారు. వర్షం కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సభ వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. సభ ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. 11 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి విమర్శించారు. దేవుడి పేరిట రాజకీయం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వరదలు వస్తే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్రంపై వరద సాయం కోసం ఒత్తిడి చేసే పరిస్థితుల్లో లేరన్నారు.
Minister Seethakka | యూరియా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే..
యూరియా సరఫరాపై (Urea Supply) బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. యూరియా ఇవ్వాల్సింది బీజేపీ ప్రభుత్వమేనని తెలిపారు. సీఎం, మంత్రులు అనేకసార్లు ఢిల్లీ వెళ్లి యూరియా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబడితే ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ బీజేపీకి పరోక్షంగా మద్దతిచ్చిందని ఆరోపించారు. ఉద్యమ పార్టీ పేరుతో పత్రికలు, ఛానళ్లు పెట్టుకున్నారని, అది పత్రిక కాదని, బీఆర్ఎస్ కరపత్రమని ఎద్దేవా చేశారు.
సోషల్ మీడియాను బీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తుందని, కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ (KCR), కేటీఆర్ అబద్ధాలు నమ్ముకుని బతుకుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులకు మహిళలంటే చిన్న చూపని, అందుకే యూరియా వద్ద, బస్సుల్లో మహిళలు పోట్లాడుకుంటున్నారని వీడియోలు వైరల్ చేస్తున్నారన్నారు.
యూరియా వద్ద, బస్సులలో పురుషులు లేరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) కులగణన చేపడితే కేసీఆర్, కేటీఆర్ పాల్గొనలేదని, వారి వివరాలు ఇవ్వలేదన్నారు. వారి ప్రభుత్వ హయాంలో ఒక్కరోజే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చులకు ఓర్చుకుని విదేశాల నుంచి వచ్చి తమ పేర్లు, వివరాలు నమోదు చేసుకున్నారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం 60 రోజులు కులగణన చేసినా కేసీఆర్, కేటీఆర్ (KTR) పాల్గొనలేదని విమర్శించారు. అధికారం పోయిందనే బాధలో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడని, పేదలు బాగుపడితే చూడలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, పేదల అభివృద్ధి కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు.