అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jubilee Hills by-election | స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. హైకోర్టు స్టే (High Court Stay) విధించడంతో పల్లె పోరు నిలిచిపోయింది. అయితే, ఇప్పుడందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే నెలకొంది. ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలు బరిలోకి దిగుతున్నాయి.
జూబ్లీహిల్స్‌పై (Jubilee Hills) జెండా ఎగురవేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రెండో ఉప ఎన్నిక ఇది. ఇందులో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అధికార పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. నవీన్‌యాదవ్‌ను అభ్యర్థిగా బరిలోకి దింపింది. మరోవైపు, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా రాష్ట్రంలో తమ ప్రాభవం తగ్గలేదని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఉవ్విళ్లూరుతోంది.
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణిని అభ్యర్థిగా ఖరారు చేసిన గులాబీ పార్టీ విజయం కోసం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఇక, కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ (BJP) జూబ్లీహిల్స్‌ను కైవసం చేసుకునేందుకు కదనరంగంలోకి దిగింది. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయనప్పటికీ, ప్రచారంలో దూసుకుపోతోంది.
Jubilee Hills by-election | రేపే నోటిఫికేషన్..
జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో వరుసగా గెలుపొందిన బీఆర్ఎస్ నేత గోపినాథ్ అనారోగ్యంతో జూన్ 8న హఠాన్మరణం చెందారు. ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది. రేపే (అక్టోబర్ 13న) నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 20 వరకు నామినేషన్ల (Nomination) స్వీకరణ, 21న నామినేషన్ల పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నవంబర్ 11న పోలింగ్ జరుగనుండగా, 14వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉప ఎన్నికలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.
Jubilee Hills by-election పట్టు పెంచుకునేందుకు కాంగ్రెస్ యత్నం
అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Election) అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా పథకాలను కొనసాగిస్తోంది. అలాగే కొన్ని మహాలక్ష్మి, సన్నబియ్యం వంటి కొత్త పథకాలకు సైతం శ్రీకారం చుట్టింది. 22 నెలల పాలనాకాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ మాట నిలబెట్టుకున్నప్పటికీ కోర్టు స్టే విధించడంతో పరిస్థితి మొదటికొచ్చింది.
రుణమాఫీ, రైతుభరోసా (Rythubharosa) వంటి పథకాల్లో లోపాలకు తోడు తులం బంగారం, పింఛన్ల పెంపు వంటి హామీలు అమలు చేయలేక చేతులెత్తేసినా, ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల వాతావరణమే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా మరింత పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచిన ఊపుతో జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసిన అధికార పార్టీ.. ముగ్గురు మంత్రులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. డివిజన్ల వారీగా ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించి, ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరును కలిసేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఓట్లు కొల్లగొట్టేందుకు వరుస సమీక్షలు, పదునైన వ్యూహాలతో సన్నద్ధమవుతోంది.
Jubilee Hills by-election | విజయం కోసం బీఆర్ఎస్ ఎత్తుగడలు..
సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడ్డిన శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు, ప్రజల్లో పార్టీ పట్ల ఏమాత్రం ప్రాధాన్యం దక్కలేదని నిరూపించుకోవాలన్న కసితో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) మృతి నేపథ్యంలో ఆయన భార్య సుజాతను అభ్యర్థిగా నిలబెట్టింది. తద్వారా సెంటిమెంట్ కలిసొస్తుందని భావిస్తున్న ఉద్యమ పార్టీ.. సర్వేలు, సమీక్షలతో బలాలు, బలహీనతలు తెలుసుకుంటూ తగిన చర్యలు చేపడుతోంది.
ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నారో గుర్తిస్తూ ఆయా డివిజన్లపై ఫోకస్ సారించింది. ఇప్పటికే డివిజన్ల వారీగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన ఉద్యమ పార్టీ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తోంది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) బాకీ కార్డులు పంచుతూ, కేసీఆర్ పాలనను, మాగంటి గోపినాథ్ చేసిన పనులను గుర్తు చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తోంది.
Jubilee Hills by-election | కదనోత్సాహంతో బీజేపీ..
పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Election) 8 చోట్ల ఘన విజయం సాధించిన బీజేపీలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అదే జోష్‌తో జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాషాయ జెండాను ఎగురవేసేందుకు సమరోత్సాహంతో ముందుకు కదులుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో దూసుకుపోతుండగా, బీజేపీ తన అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. లంకల దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర నాయకత్వం కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది.
అయితే, దీపక్‌రెడ్డి లేదా కీర్తిరెడ్డికి అవకాశం దక్కుతుందని పార్టీ చెబుతున్నాయి. మరోవైపు, అభ్యర్థి ఖరారు కాకపోయినప్పటికీ, ప్రచారంలో మాత్రం దూసుకుపోతుంది. డివిజన్ల వారీగా నేతలు, కార్యకర్తలతో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ బలాబలాలను అంచనా వేస్తోంది. నోటిఫికేషన్ కూడా వెలువడనున్న తరుణంలో ప్రచారంలో జోరు పెంచేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. ఉప ఎన్నికలో విజయం కోసం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను రంగంలోకి దించనుంది.