అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Election Commission | జూబ్లీహిల్స్ నియోజకవర్గం(Jubilee Hills Constituency)లో జరగబోయే ఉప ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు చేసే ప్రచార వ్యయాలపై ఎన్నికల సంఘం(Election Commission) ప్రత్యేక దృష్టి పెట్టింది. వ్యయాల్లో పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు ఖర్చుల అంశానికి ఖచ్చితమైన ధరలు కూడా నిర్ణయించారు.
ఈ ధరల జాబితాను శుక్రవారం విడుదల చేస్తూ, ఇకపై అభ్యర్థులు టీ తాగించినా, భారీ సభలు నిర్వహించినా ప్రతి పైసాకు కూడా లెక్క చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం, అభ్యర్థులు తమ రోజువారీ ఖర్చులను తప్పకుండా నమోదు చేసి అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను తుంగలో తొక్కితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Election Commission | లెక్క చెప్పాల్సిందే..
అభ్యర్థులు తమ ఖర్చులను తక్కువ చేసి చూపకుండా నిరోధించే క్రమంలో ఈ ధరల పట్టికను రూపొందించినట్లు స్పష్టం చేశారు. అధికారుల ప్రకారం, ఇకపై ఓ సింగిల్ టీకి Tea రూ.5, పెద్ద కప్పు టీకి రూ.10గా నిర్ణయించడం జరిగింది. అలాగే ప్లేట్ ఇడ్లీ (నాలుగు ఇడ్లీలతో) ధర రూ.20, ఒక సమోసా రూ.10గా ఖరారు చేశారు. వెజ్ బిర్యానీ (750 గ్రాములు) ధర రూ.115, చికెన్ బిర్యానీ రూ.170, మటన్ బిర్యానీ రూ.180గా నిర్ణయించారు. కార్యకర్తలకు అందించే నీటి ప్యాకెట్‌కు రూ.2, ఒక లీటర్ వాటర్ బాటిల్‌కు రూ.20గా ఖర్చు చూపాలి.
ప్రచారంలో వినియోగించే వేదికలు, ఫంక్షన్ హాళ్లకూ ఖచ్చితమైన ధరలు కేటాయించారు. మినీ ఫంక్షన్ హాల్‌కు రోజుకు రూ.6,200, పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్‌కు రూ.1,25,000గా ధరను నిర్ణయించారు. అలాగే డ్రోన్ కెమెరా(Drone Camera) వినియోగానికి 12 గంటలకే రూ.5,000గా ఖర్చు నమోదు చేయాల్సి ఉంటుంది. కుర్చీలు, బ్యానర్లు, వాల్ పోస్టర్లు, టీ షర్టులు, మైకులు, సౌండ్ సిస్టమ్స్ వంటి ప్రచార సామాగ్రికి కూడా ప్రత్యేక ధరలు ఈ జాబితాలో పేర్కొన్నారు.ఈ చర్యలతో అభ్యర్థుల ప్రచార వ్యయాలపై పక్కా పర్యవేక్షణ ఉండనుంది. ఎన్నికల క్రమశిక్షణను మరింత బలపరిచే దిశగా ఈ చర్యలు వేగంగా అమలవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.