అక్షరటుడే, ఆర్మూర్: Vinay Reddy | మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓ పెద్ద మోసగాడని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్ రెడ్డి (Vinay Reddy) విమర్శించారు. ఆర్మూర్ పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవన్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు.
Vinay Reddy | కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ సమానమే..
కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ సమానమేనని, ఆర్మూర్ అభివృద్ధికి తాను పాటుపడుతున్నానని స్పష్టం చేశారు. గతంలో అక్రమంగా ఇచ్చిన 147 ఇంటి నెంబర్లను తాము వచ్చాక రద్దు చేశామన్నారు. జీవన్‌రెడ్డిని (Jeevan Reddy) ఓడించాలనే ఉద్దేశంతో ప్రచారం చేసి ఆయనను మూడోస్థానికి పరిమితం చేశానని పేర్కొన్నారు.
Vinay Reddy | జీవన్‌రెడ్డిపై సినిమా తీస్తా..
జీవన్ రెడ్డి మోసాలపై సినిమా తీస్తే బంపర్ హిట్ అవుతుందని, ఎవరైనా మంచి దర్శకుడు దొరికితే తానే జీవన్ రెడ్డి అక్రమాలు, అరాచకాలపై చిత్రం తీస్తానని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్న అందరూ ఎమ్మెల్యేల కంటే పెద్ద మోసగాడు జీవన్ రెడ్డి అని విమర్శించారు. పదేళ్ల పాలనలో జీవన్ రెడ్డి హత్య రాజకీయాలే నడిపారని ఆరోపించారు. ప్రజలలో తన స్థాయి ఏమిటో జీవన్‌రెడ్డి తెలుసుకోవాలన్నారు.
జీవన్ రెడ్డి బాధితులు ఎవరున్నా పీవీఆర్ భవన్‌కు రావాలన్నారు. ఆయన అనుచరులు ఎక్కడైనా దౌర్జన్యాలకు పాల్పడితే గల్లా పట్టుకొని అడగాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ను ఖాళీ చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. జీవన్ రెడ్డిని ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, కవితలు ఎలా అయితే తరిమి కొట్టారో.. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి సైతం తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, నాయకులు పండిత్ పవన్, గిరి, కొంతం మురళి, దొండి రమణ, చిట్టీ రెడ్డి, భూపేందర్, జిమ్మి రవి, మజీద్, వాసు, రవికాంత్ రెడ్డి, గోపి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
