అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Municipal elections | రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు (Municipal elections) జరగనున్నాయి. ఈ ఎన్నికలో పోటీకి తాము సిద్ధమని జనసేన ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో సంక్రాంతి (Sankranthi) తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర (Medaram Maha Jatara festival) ఉంది. ఈ వేడుక అనంతరం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో పోటీకి ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎంఐఎం సైతం పలు చోట్ల పోటీకి దిగనుంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పార్టీ జనసేన (Pawan Kalyan Janasena party) సైతం తాము బరిలో ఉంటామని ప్రకటించడం గమనార్హం.
Municipal elections | బలోపేతం కోసం..
సినీ నటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఆయన ఏపీ కేంద్రంగానే రాజకీయాలు చేశారు. తెలంగాణలో సైతం పార్టీ ఉన్నా.. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో నేరుగా పోటీ చేయలేదు. అయితే తాజాగా పురపోరులో పోటీ చేస్తామని పార్టీ తెలిపింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఎన్నికలకు తక్కవ సమయం ఉన్నప్పటికి వీలైనన్ని స్థానాల్లో అభ్యర్థులు బరిలో దింపుతామని ప్రకటించింది. ప్రచారానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు పార్టీ సూచించింది.
Municipal elections | ఒంటరిగానేనా..
జనసేన ప్రస్తుతం ఏపీలో టీడీపీ, బీజేపీతో కలిసి అధికారం పంచుకుంటుంది. ఈ క్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందా.. లేక బీజేపీతో జత కడుతుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో పవన్ కల్యాణ్‌కు క్రేజ్ ఉంది. ఇటీవల ఆయన కొండగట్టులో పర్యటించారు. టీటీడీ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే పూర్తిస్థాయి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని జనసేన తెలిపింది.