అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Singer Janaki | ఫిల్మ్ ఇండస్ట్రీ (Film Industry)లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది కాలంలో ఎంతో మంది సినీ ప్రముఖులను పరిశ్రమ కోల్పోయింది. తాజాగా మరో విషాద వార్త ఇండస్ట్రీని కలిచివేసింది. ప్రముఖ సీనియర్ గాయని ఎస్. జానకి కుమారుడు మురళీకృష్ణ కన్నుమూశారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మురళీకృష్ణ (Muralikrishna) గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 65 సంవత్సరాల వయసులో ఆయన మరణం జానకి కుటుంబానికే కాకుండా సినీ వర్గాలు, అభిమానుల్లో కూడా తీవ్ర ఆవేదనను మిగిల్చింది.మురళీకృష్ణ మరణవార్త వెలుగులోకి రాగానే సినీ పరిశ్రమ నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మరణాన్ని ప్రముఖ గాయని చిత్ర సోషల్ మీడియా (Social Media) ద్వారా వెల్లడించారు.
Singer Janaki | శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
ఈ సందర్భంగా ఆమె భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను షేర్ చేశారు. “ఈ బాధాకరమైన సమయంలో జానకి అమ్మకు దేవుడు అపారమైన ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ ఉదయం మురళీ అన్న ఆకస్మిక మరణవార్త విని షాక్‌కు గురయ్యాను. నేను ఎంతో ప్రియమైన సోదరుడిని కోల్పోయాను. మేమంతా ఒక ప్రేమగల వ్యక్తిని కోల్పోయాం. ఈ భరించలేని దుఃఖాన్ని తట్టుకునే శక్తిని దేవుడు అమ్మకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మురళీ అన్న ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలి. ఓం శాంతి” అంటూ పోస్ట్ చేశారు.
మురళీకృష్ణ బహుముఖ ప్రతిభ కలిగిన వ్యక్తిగా పేరొందారు. గాయని ఎస్. జానకి తనయుడిగా మాత్రమే కాకుండా, తన స్వంత ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన నటుడిగా, నాట్యకళాకారుడిగా రాణించారు. ముఖ్యంగా భరతనాట్యంలో ఆయనకు ప్రత్యేక ప్రావీణ్యం ఉండేది. దేశవ్యాప్తంగా అనేక వేదికలపై భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు, పలు సినిమాల్లో నటించి తన నటనతో కూడా గుర్తింపు పొందారు.మురళీకృష్ణ అకాల మరణంతో ఎస్. జానకి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జీవితాంతం సంగీత ప్రపంచానికి సేవలందించిన జానకి గారికి ఈ దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు ఇవ్వాలని సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.