అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Jagruthi | రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అడుగులు వేస్తోంది. ఇందుకోసం బ్లూ ప్రింట్ రూపొందించడంలో నిమగ్నమయ్యింది. కొత్త పార్టీ ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజల నుంచి తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం అవసరమని సూచనలు వచ్చాయని జాగృతి వర్గాలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రస్ఫుటింపజేసేలా రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) స్వీయ రాజకీయ శక్తిగా నిలుస్తామని కవిత తెలిపారు.
Telangana Jagruthi | 30 కమిటీల ఏర్పాటు
జాగృతి ముఖ్య నాయకులు బుధవారం సమావేశమై ‘‘పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం – సంపూర్ణ అధ్యయనం’’ సహా 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని, రాష్టంలోని వివిధ రాజకీయ పార్టీల రాజ్యాంగాలను స్టడీ చేసి జాగృతికి ప్రజాస్వామ్యబద్ధమైన, పటిష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించడానికి న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయిమెంట్, రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ సాధికారత తదితర కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ముగ్గురు నుంచి నలుగురు సభ్యులను నియమించారు.
కమిటీల బాధ్యులు రానున్న పది రోజుల పాటు వారికి అప్పగించిన రంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందిస్తారు. తమ నివేదికలను ఈనెల 17వ తేదీన జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ అధ్యక్షతన నియమించిన స్టీరింగ్ కమిటీకి సమర్పిస్తారు. స్టీరింగ్ కమిటీ నివేదికపై జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గం మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై అందరి అభిప్రాయలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటుందని జాగృతి నాయకులు తెలిపారు. అయితే కొత్త పార్టీ ఏర్పాటు కోసమే జాగృతి ఈ కమిటీలు, ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.