అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BRS | బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పుకోవడం సిగ్గు చేటని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ (MLA Sanjay) అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది అధికార కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం తీర్పు మేరకు స్పీకర్ విచారణ చేపట్టారు. సోమవారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు, వారిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. టి ప్రకాశ్‌గౌడ్ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్, కాలె యాదయ్య వర్సెస్ చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ చింతా ప్రభాకర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విచారణ సోమవారం సాగింది. అయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలు వారి తరఫున లాయర్లను పంపించారు.
BRS | రాజ్యాంగాన్ని కాపాడాలి
విచారణ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిజంగా చీము, నెత్తురు ఉంటే రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్లి చేసిన తప్పును ఒప్పుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. మీడియా వాళ్లు రాసిన వార్తలు కూడా నిజం కాదని ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నారని విమర్శించారు. స్పీకర్ (Speaker) రాజ్యాంగాన్ని కాపాడాలని ఆయన కోరారు.
BRS | 8 మంది వివరణ ఇచ్చారు
పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeswar Reddy) మాట్లాడుతూ.. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం బహిరంగ రహస్యమే అన్నారు. తమ ఫిర్యాదుతో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇచ్చారని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున హాజరైన లాయర్లు తిమ్మిని బమ్మిని చేసేందుకు ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. అసంబద్ధ ప్రశ్నలు వేసినా.. ఓపికతో సమాధానం చెప్పామన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరలేదని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.