అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Konda Murali | ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal District) కాంగ్రెస్‌లో కొంతకాలంగా నేతల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వ్యాఖ్యలతో పలువురు ఎమ్మెల్యే, నేతలు ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గతంలో ఓ సారి కొండా మురళి క్రమ శిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. తాజాగా ఆదివారం గాంధీ భవన్(Gandhi Bhavan)లో క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించింది. కొండా మురళి హాజరై కమిటీ ఎదుట వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ(Congress Party) మాటను జవదాటను అని పేర్కొన్నారు.
Konda Murali | పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా
రెండు గంటల పాటు కొండా మురళి(Konda Murali) తో క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించింది. తన వివరణతో కమిటీ సంతృప్తి చెందిందని ఆయన అన్నారు. తన రక్తంలో కాంగ్రెస్ ఉందని.. పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ప్రకటించారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ప్రధాన మంత్రిని చేయాలన్నదే తమ కోరిక అన్నారు. అందుకోసం అందరితో కలిసి పనిచేస్తానని వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో కలిసి పని చేయాలని క్రమశిక్షణ కమిటీ ఆదేశించిందని పేర్కొన్నారు.
Konda Murali | ఏమన్నారంటే..
కొండా మురళి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA)లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari)ని ఉద్దేశించి పార్టీ మారిన వారు రాజీనామా చేయాలన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తమ మద్దతుతోనే గెలిచారని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా ఆ స్థానం నుంచి భవిష్యత్‌లో తమ కూతురు పోటీ చేస్తుందనేలా సంకేతాలు ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ సైతం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా దంపతులపై ఫిర్యాదు చేశారు.
Konda Murali | రాజగోపాల్‌రెడ్డి గురించి చర్చించలేదు
క్రమశిక్షణ కమిటీ సమావేశం అనంతరం ఛైర్మన్ మల్లు రవి (Chairman Mallu Ravi) మీడియాతో మాట్లాడారు. కొండా మురళి వివాదాన్ని కొలిక్కి తీసుకు వచ్చామన్నారు. వరంగల్ నేతల మధ్య విభేదాలు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అంశంపై చర్చించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కలిసికట్టుగా పని చేసేందుకు నేతలు అంగీకరించారన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ అంశం ఇంకా తమ కమిటీ ముందుకు రాలేదన్నారు.