అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America vs Iran | అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. తమ దేశ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali khamenei)పై ఎలాంటి దాడి జరిగినా దానిని ఇరాన్ జాతిపై సంపూర్ణ యుద్ధంగా పరిగణిస్తామని ఇరాన్ అమెరికాకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ ఉధృతమవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
America vs Iran | ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటు స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇరాన్‌లో కొత్త నాయకత్వం రావాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్ అధ్యక్షుడు (Iranian President) మసూద్ పెజెష్కియాన్ ఆదివారం ‘ఎక్స్’ (X) వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ఇరాన్‌పై ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా మేం తీవ్రంగా ప్రతిఘటిస్తాం. మా దేశ గొప్ప నాయకుడిపై దాడి చేయడం అంటే ఇరాన్ జాతితో సంపూర్ణ యుద్ధానికి దిగడమే అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 5000 మందికి పైగా మరణించినట్లు ఓ ఇరాన్ అధికారి ధ్రువీకరించారు. మృతుల్లో సుమారు 500 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు.ఈ మరణాలకు అమెరికానే కారణమని అయతొల్లా ఖమేనీ ఆరోపణలు చేస్తుండగా, ట్రంప్ మాత్రం ఇరాన్ నాయకత్వ వైఫల్యాలే పరిస్థితులకు కారణమని విమర్శిస్తున్నారు. ఖమేనీపై దాడి చేస్తే యుద్ధమే అన్న ఇరాన్ హెచ్చరికతో మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఇప్పటికే సున్నితంగా ఉన్న సంబంధాలు తాజా పరిణామాలతో మరింత క్షీణిస్తున్నాయి. ఈ పరిస్థితులు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.