అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPO | డిసెంబర్ నెలలోనూ ప్రైమరీ మార్కెట్‌లో సందడి కొనసాగుతోంది. మొదటివారంలో 14 కంపెనీల ఐపీవో (IPO)లు రాగా.. రెండో వారంలో 13 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. మెయిన్‌బోర్డుకు చెందిన కరోనా రెమిడీస్, వేక్‌ఫిట్ ఇన్నోవేషన్, నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్, పార్క్ మెడి వరల్డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీవోల సబ్‌స్క్రిప్షన్ ఈ వారంలో ప్రారంభం కానుంది.
ఇందులో కరోనా రెమిడీస్, వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్, పార్క్ మెడి వరల్డ్ ఐపీవోల జీఎంపీ బాగుండడంతో ఆయా కంపెనీల ఐపీవోలకు భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. అలాగే అతిపెద్ద ఐపీవో అయిన ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఏఎంసీ పబ్లిక్ ఇష్యూ కోసం ఇన్వెస్టర్లు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ వారంలో ప్రారంభమయ్యే ఐపీవోల వివరాలు తెలుసుకుందామా..
కరోనా రెమిడీస్..
అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మాస్యూటికల్ రంగానికి చెందిన కరోనా రెమెడీస్ (Corona Remedies) రూ. 655.37 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వస్తోంది. ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్ ఈనెల 8న ప్రారంభమై 10న ముగుస్తుంది. కంపెనీ షేర్లు ఈనెల 15న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి. కంపెనీ ధరల శ్రేణిని రూ. 1,008 నుంచి రూ. 1,062 గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం ఎగువ ధరల శ్రేణి వద్ద రూ. 14,868తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జీఎంపీ ఒక్కో షేరుకు రూ. 290 ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 27 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వేక్‌ఫిట్ ఇన్నోవేషన్..
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పరుపులు, హోమ్ ప్రొడక్ట్స్‌ను విక్రయించే ఫర్నిషింగ్ బ్రాండ్ వేక్‌ఫిట్ ఇన్నోవేషన్ (Wakefit Innovations) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 1,289 కోట్లు సమీకరించనుంది. ధరల శ్రేణిని రూ.185 నుంచి రూ. 195గా ఉంది. ఒక లాట్‌లో 76 షేర్లున్నాయి.. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం కనీసం రూ.14,820తో బిడ్ వేయాలి. ఈ ఐపీవో ఈనెల 8న ప్రారంభమై 10తో ముగియనుంది. కంపెనీ షేర్లు ఈనెల 15న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 36 ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో ఐపీవో ఇన్వెస్టర్లకు 18 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్..
భారతదేశంలో అతిపెద్ద డయాలసిస్ నెట్‌వర్క్ కలిగి ఉన్న నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ (Nephrocare Health Services) పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 871.05 కోట్లు సమీకరించనుంది. ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్ ఈనెల 10న ప్రారంభమై 12న ముగుస్తుంది. 17న కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్‌లో లిస్టవుతాయి. ధరల శ్రేణిని ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 438 నుంచి రూ. 460 మధ్య నిర్ణయించారు. ఒక లాట్‌లో 32 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,720 తో దరఖాస్తు చేసుకోవాలి.
పార్క్ మెడి వరల్డ్..
పార్క్ హాస్పిటల్స్ బ్రాండ్ పేరుతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్వహిస్తున్న పార్క్ మెడి వరల్డ్ (Park Medi World).. తన సేవలను విస్తృతం చేయడం కోసం స్టాక్ మార్కెట్‌లో అడుగిడుతోంది. ఐపీవో ద్వారా రూ. 9200 కోట్లు సమీకరించనుంది. కంపెనీ సబ్‌స్క్రిప్షన్ 10న ప్రారంభమై 12న ముగుస్తుంది. కంపెనీ తన షేర్ల ధరల శ్రేణిని రూ. 154 నుంచి రూ. 162 గా నిర్ణయించింది. రిటైల్ పెట్టుబడిదారులు కనిష్టంగా 92 ఈక్విటీ షేర్ల కోసం గరిష్ట ప్రైస్‌బ్యాండ్ వద్ద రూ. 14,904 తో దరఖాస్తు చేసుకోవాలి. జీఎంపీ ఒక్కో షేరుకు రూ. 33 ఉంది. ఐపీవో అలాట్ అయితే 20 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ..
భారతదేశంలో రెండో అతిపెద్ద ఏఎంసీ అయిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ICICI Prudential AMC) ఐపీవోకు వస్తోంది. మార్కెట్‌నుంచి రూ. 10,602.65 కోట్లు సమీకరించనుంది. సబ్‌స్క్రిప్షన్ ఈనెల 12న ప్రారంభం కానుంది. బిడ్డింగ్‌కు 16 వరకు అవకాశం ఉంది. ధరల శ్రేణిని రూ. 2,061 నుంచి రూ. 2,165గా నిర్ణయించింది. జీఎంపీ రూ. 135 గా ఉంది. లిస్టింగ్ సమయంలో 6 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
ఎస్‌ఎంఈ ఐపీవోలు..
ఈనెల 8న ప్రోడాక్స్ సొల్యూషన్స్, రిద్ధి డిస్‌ప్లే ఎక్విప్‌మెంట్స్, కేవీ టాయ్స్ ఇండియా (K. V. Toys India) కంపెనీల పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానుంది.
ఈనెల 10న షిప్‌వేవ్ ఆన్‌లైన్, యూనిసెమ్ అగ్రిటెక్ ఐపీవోలు ఓపెన్ అవుతాయి.
డిసెంబర్ 11న పజ్‌సన్ అగ్రో, హెచ్‌ఆర్‌ఎస్ అలుగ్లేజ్‌ల సబ్‌స్క్రిప్షన్ మొదలవుతుంది.
డిసెంబర్ 12న అశ్విని కంటైనర్ మూవర్స్ ఐపీవో ప్రారంభం అవుతుంది.