అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | ‘పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. అబార్షన్ చేసిన ప్రైవేట్ వైద్యుడు’ శీర్షికతో ‘అక్షరటుడే’లో బుధవారం కథనం ప్రచురితం కాగా.. అధికారులు స్పందించారు. కామారెడ్డి నుంచి వైద్యాధికారులు, తాడ్వాయి పోలీసులు బుధవారం రాత్రి తాడ్వాయి గ్రామానికి (Tadwai Village) చేరుకుని సదరు అమ్మాయికి డీఎన్ఏ పరీక్షలు (DNA Tests) నిర్వహించినట్లుగా సమాచారం. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది.
మళ్లీ గురువారం ఉదయమే వైద్యులు, కామారెడ్డి, తాడ్వాయి పోలీసులు (Tadwai Police) గ్రామానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. అయితే ఆర్నెళ్ల క్రితమే అమ్మాయి గర్భం దాల్చడంతో అప్పటికి ఆ యువకుడు మైనర్ అయి ఉండవచ్చన్న అనుమానాలు అధికారులు వ్యక్తం చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఏ వైద్యుడి వద్ద అబార్షన్ చేయించారనే వివరాలు ఇంకా బయటకు పొక్కనీయడం లేదు. పోలీసులు, వైద్యులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టడంతో గ్రామంలో ఆందోళన నెలకొన్నట్టుగా తెలుస్తోంది.
Kamareddy | వైద్యుడిలో వణుకు..?
వైద్యాధికారులకు సమాచారం ఇవ్వకుండా బేరం కుదుర్చుకుని అబార్షన్ చేసిన వైద్యుడికి అధికారులు విచారిస్తున్నట్లుగా సమాచారం. గ్రామంలో ఏం జరుగుతోందని ఇప్పటికప్పుడు ఆయన కొందరి ద్వారా సమాచారం తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇరు వర్గాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి వైద్యాధికారులకు చెప్పాల్సిన బాధ్యత వైద్యుడిపై ఉండగా ఆయన అబార్షన్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
Kamareddy | వైద్యుడిపై చర్యలు తీసుకుంటారా..?
జిల్లాలో వైద్యాధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఉన్నతాధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ తరహా అబార్షన్లు చేసే అవకాశం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ ఘటనలో ఆర్నెళ్ల గర్భం తొలగించిన వైద్యుడిపై చర్యలు తీసుకుంటారా..? అతనిపై కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
