అక్షరటుడే, వెబ్‌డెస్క్: WPL 2026 | మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో క్రికెట్ అభిమానులకు గుండె దడ పుట్టించే మ్యాచ్ చూసే అవకాశం దక్కింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం (Patil Stadium) వేదికగా గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఈ పోరు ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిపోయింది.
రెండు జట్లు కలిపి ఏకంగా 414 పరుగులు చేయడం ఈ మ్యాచ్ ఎంత హై స్కోరింగ్‌గా సాగిందో చెప్పకనే చెబుతోంది. గెలుపు దాదాపు ఖాయమని భావించిన ఢిల్లీ చివరి ఓవర్లో చేజారిపోగా, ఓటమి అంచుల నుంచి అద్భుతంగా పుంజుకున్న గుజరాత్ 4 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు నిస్సందేహంగా హీరోగా నిలిచింది గుజరాత్ స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్.
WPL 2026 | థ్రిల్లింగ్ మ్యాచ్..
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే గుజరాత్ ఓపెనర్లు సోఫీ డివైన్, బెత్ మూనీ ఆ నిర్ణయాన్ని పూర్తిగా తప్పు అని నిరూపించారు. మొదటి ఓవర్ నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డ సోఫీ డివైన్ (Sophie Devine) అసాధారణ బ్యాటింగ్‌తో మైదానాన్ని ఉర్రూతలూగించింది. కేవలం 42 బంతుల్లో 7 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 95 పరుగులు చేసి సెంచరీకి కేవలం ఐదు పరుగుల దూరంలో నిలిచింది. ఆమె బ్యాటింగ్ చూస్తే బౌలర్లకు ఎలాంటి సమాధానం లేకుండా పోయింది. మరోవైపు బెత్ మూనీ (19) కాస్త నిదానంగా ఆడినా, మిడిల్ ఆర్డర్‌లో యాష్లే గార్డనర్ (49) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఫలితంగా గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బౌలర్ నందిని శర్మ (Nandini Sharma) 5 వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేసినప్పటికీ, అప్పటికే గుజరాత్ బ్యాటర్లు మ్యాచ్‌పై పట్టు సాధించారు.
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఏమాత్రం భయపడలేదు. ఓపెనర్లు లిజెల్ లీ, లారా వోల్వార్డ్ మైదానంలో పరుగుల వరద పారించారు. లిజెల్ లీ 54 బంతుల్లో 86 పరుగులు చేయగా, వోల్వార్డ్ కూడా అదే స్కోర్‌తో (86) అద్భుతంగా ఆడింది. వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్‌ను పూర్తిగా ఢిల్లీ వైపు తిప్పింది. ఒక దశలో ఢిల్లీ విజయం కేవలం ఫార్మాలిటీగా కనిపించింది. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి కేవలం 7 పరుగులు మాత్రమే అవసరం. చేతిలో వికెట్లు ఉన్నాయి, క్రీజులో సెట్ అయిన వోల్వార్డ్ ఉంది. అంతా ఢిల్లీ గెలుపు ఖాయమని భావించిన సమయంలోనే అసలు డ్రామా మొదలైంది. గుజరాత్ కెప్టెన్ అత్యంత కీలకమైన చివరి ఓవర్ బంతిని సోఫీ డివైన్‌కు అప్పగించింది. బ్యాటింగ్‌లో ఇప్పటికే తుఫాన్ సృష్టించిన సోఫీ, బౌలింగ్‌లోనూ తన క్లాస్ చూపించింది. ఆఖరి 6 బంతుల్లో ఢిల్లీకి అవసరమైన 7 పరుగులను ఆమె తన వేగం, కచ్చితత్వం, తెలివితో అడ్డుకుంది. ఆ ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి, 2 కీలక వికెట్లు పడగొట్టి ఢిల్లీ నోటికాడ ముద్దను లాగేసుకుంది. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ 205 పరుగులకే పరిమితమై, 4 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.