అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad CP | బంగారం దుకాణాలను కొల్లగొట్టి చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) వివరాలు వెల్లడించారు.
Nizamabad CP | గతనెల 21వ తేదీన..
బోధన్ పట్టణ (Bodhan town) పరిధిలో గతనెల 21వ తేదీన నలుగురు సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ముఠా ఆచన్పల్లిలో ఓ బైక్ చోరీకి పాల్పడింది. అనంతరం వారు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఉన్న రెండు బంగారు దుకాణాల షెట్టర్లను తొలగించారు. మొత్తంగా 35 తులాల బంగారం, 14 కిలోల వెండి నగలు దోచుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న బోధన్ పట్టణ పోలీసులు సీసీ పుటేజీలు (CCTV footage), సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు.
Nizamabad CP | అనుమానాస్పద వ్యక్తులను..
ఈ క్రమంలో ఈనెల 11న ఆచన్పల్లి బైపాస్ రోడ్ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా కొందరు వ్యక్తులు రోడ్డుపక్కనే మద్యం సేవిస్తూ పోలీసుల కంటబడ్డారు. వారిని విచారించేలోపు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి ఇద్దరు వ్యక్తులు, బైకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా షట్టర్లు పగులగొట్టింది తామేనని ఒప్పుకున్నారు. అనంతరం వారివద్ద నుంచి 14 తులాల బంగారం నగలు, 6 కిలోల వెండి వస్తువులు, రెండు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చురుకుగా వ్యవహరించిన బోధన్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ, బోధన్ టౌన్ ఎస్సై మనోజ్ కుమార్, ఏఎస్సై బోధన్, బాబురావు, సిబ్బంది రవి, మహేష్, సాయి కుమార్, అశోక్లను సీపీ అభినందించారు.