అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తారు.. తాళాలు పగులగొట్టి ఇళ్లు దోచేస్తారు.. వెళ్తూ..వెళ్తూ.. ఆ ఇంటి ముందు గడ్డపారలు వదిలి వెళ్తారు.. ఇలా వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసిరిన దొంగల ముఠాను కామారెడ్డి పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ మేరకు ఎస్పీ రాజేష్‌చంద్ర (SP Rajesh Chandra) మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Kamareddy | తాడ్వాయి మండలంలో..
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తాడ్వాయి మండలం (Tadwai Mandal) చిట్యాల గ్రామంలో ఈనెల 12న ఓ ఇంటి తాళాన్ని గడ్డపారతో పగులగొట్టి ఇంట్లోని బీరువాలో బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన జరగగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాస్ రావు (DSP Srinivas Rao) ఆధ్వర్యంలో సీఐ సంతోష్ (CI Santosh), గాంధారి, తాడ్వాయి ఎస్సైలు ఆంజనేయులు, నరేష్లతో కూడిన మూడు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరాలను పరిశీలించగా బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ పాక్షికంగా లభించడంతో మరోసారి చోరీలకు పాల్పడే అవకాశం ఉండడంతో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఐదుగురు ముఠా సభ్యులు పట్టుబడ్డారు. వీరు జిల్లాలో తాడ్వాయితో పాటు గాంధారి, లింగంపేట, రాజంపేట, బాన్సువాడ పరిధిలోని తొమ్మిది ఇళ్లలో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. ఉదయం సాధారణ వ్యక్తుల మాదిరిగా గ్రామాల్లో రెక్కీ నిర్వహించి రాత్రి సమయాల్లో తాళాలు వేసి ఇళ్లలో చోరీలకు పాల్పడడం వీరి అలవాటు. చోరీ అనంతరం గడ్డపారలను అక్కడే వదిలి వెళ్తారు.
Kamareddy | చోరీ సొత్తు జ్యువెలరీ షాపుల్లో విక్రయం
ఇలా చోరీల ద్వారా సేకరించిన సొత్తును బాన్సువాడ, నిజామాబాద్ జ్యూవెలరీ షాపులలో (Nizamabad Jewellery Shop) విక్రయిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో గాంధారి మండలం గుర్జాల్ తండాకు చెందిన బస్సీ జోధ్ రాజ్, మహారాష్ట్ర మైందానే గ్రామానికి చెందిన అంకుష్ ప్రేమ్ సింగ్ సాబలే (ప్రస్తుత నివాసం గుర్జాల్ తండా) ఉన్నారు. అలాగే గాంధారి మండలం చెన్నపూర్ తండాకు చెందిన బామన్ మహేందర్, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కోల్పోల్ గ్రామానికి చెందిన హీరాలాల్, నునావత్ గణేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరి నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, 22 తులాల వెండి నగలు, ఒక బైక్, 5 మొబైల్స్, రూ.8500 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించి సిబ్బందికి అవార్డు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, సదాశివనగర్ సీఐ సంతోష్, తాడ్వాయి, గాంధారి ఎస్సైలు నరేష్, ఆంజనేయులు పాల్గొన్నారు.
