Education System
Education System | చదువు అర్థం కావడం లేదని.. ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Education System | చదువు అర్థం కావడం లేదని ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో (Hanmakonda District) చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లాకు చెందిన మిట్టపల్లి కుమార్‌- కవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శివాని(16)ని హనుమకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంపీసీ ఫస్ట్​ ఇయర్​లో (MPC 1st Year) చేర్పించారు. అయితే జేఈఈ బ్యాచ్‌లో ఆమెను జాయిన్​ చేశారు. శివాని మాత్రం ఎంసెట్​ బ్యాచ్​లో చదువుకోవాలని భావించింది. తల్లిదండ్రులు జేఈఈ బ్యాచ్​(JEE Batch)లో వేయడంతో చదువు అర్థం కావడం లేదని మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో ఆదివారం కాలేజీలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Education System | చెల్లిని మంచిగా చదివించండి

శివాని ఆత్మహత్యకు ముందు సూసైడ్​ లెటర్​ రాసింది. తనకు చదువు అర్థం కావడం లేదని అందులో పేర్కొంది. తనకు కాలేజీలో చదువు అర్థం కావడం లేదని.. ఆ విషయం చెబితే తల్లిదండ్రులు వినిపించుకోలేదని శివాని లేఖలో రాసింది. ‘‘మీరు చెప్పిన చదువు నాతోని ఐతలే.. నేను చదువుదాం అనున్న దానికి మీరు ఒప్పుకోవడం లేదు. ఇక నాకు చావే దిక్కు” అని విద్యార్థి రాసిన సూసైడ్​ నోట్​ కంట తడి పెట్టిస్తోంది. తన చెల్లిని మంచిగా చదివించాలని అందులో ఆమె తల్లిదండ్రులను కోరింది.

Education System | బలవంతంగా చదివించొద్దు

శివాని ఆత్మహత్య ప్రస్తుత విద్యా వ్యవస్థ (Education System), తల్లిదండ్రుల తీరుపై చర్చకు దారి తీసింది. ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటి నుంచి గారభంగా పెంచుతారు. అయితే ఇంటర్​, ఆపై చదువుల సమయంలో మాత్రం తమ ఆలోచనలను వారిపై రుద్దుతున్నారు. పిల్లలకు ఇష్టం ఉన్న కోర్సులు కాకుండా.. తమకు నచ్చిన కోర్సుల్లో జాయిన్​ చేస్తున్నారు. దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొంతమంది ఇలా తనువు చాలిస్తున్నారు.

పిల్లలపై చదువును బలవంతంగా రుద్దొద్దని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. వారికి నచ్చిన కోర్సులో జాయిన్​ చేయాలని చెబుతున్నారు. ఇష్టం లేకుండా కోర్సులో జాయిన్​ చేస్తే తర్వాత వారు చదివే అవకాశాలు తక్కువ అని పేర్కొంటున్నారు. అంతేగాకుండా తల్లిదండ్రులు డబ్బులు కడుతున్నా.. తాము చదవడం లేదని వారు ఆత్మన్యూనతకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో నచ్చిన కోర్సులో జాయిన్​ చేసి వారిని ప్రోత్సహించాలి.

Education System | మార్కులే శాశ్వతం కాదు

ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డకు మంచి మార్కులు రావాలని కలలు కంటున్నారు. అయితే కలలు కంటే ఫర్వాలేదు కానీ.. వాటిని సాధించాలని పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. విద్యా సంస్థలు కూడా మార్కులు, ర్యాంకులే శాశ్వతం అన్నట్లు ప్రచారాలు చేస్తున్నాయి. ఎల్​కేజీ, యూకేజీలో తమ పిల్లలకు ఫస్ట్​ ర్యాంక్​ వచ్చిందని పలువురు తల్లిదండ్రులు (Parents) సంబర పడుతున్నారు. ర్యాంక్​ రాలేదని మిగతా వారు తమ పిల్లలను బాగా చదవాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే చాలా బడుల్లో బట్టి చదువులతో మార్కులు తెచ్చుకుంటున్నారు. దీంతో భవిష్యత్​లో ప్రయోజనం ఉండదు. మార్కుల కంటే విద్యార్థులకు జ్ఞానం పెంపొందించేలా తల్లిదండ్రులు చర్యలు చేపట్టాలి.