అక్షరటుడే, వెబ్‌డెస్క్: Warangal | ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాకు (Social Media) బానిసలుగా మారిపోతున్నారు. టీనేజీ పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దల వరకు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు.
కొత్త పరిచయాలు.. ఆన్లైన్ చాటింగ్‌ల (Online Chatting) పేరిట కొందరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ పచ్చని కాపురంలో ఇన్స్టాగ్రామ్ (Instagram) చిచ్చుపెట్టింది. దీంతో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.
వరంగల్ జిల్లా (Warangal district) హన్మకొండ హసన్‌పర్తిలో నివాసం ఉండే అల్లాడి సృజన్, ప్రత్యూష దంపతులు. వీరిద్దరూ డాక్టర్లే. ఇద్దరు వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్నారు.
అయితే సృజన్ ఇటీవల మరో మహిళతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తెలిసింది. నిత్యం సదరు మహిళతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు ఆ దంపతుల మధ్య గొడవలు కూడా జరిగాయి. అయినా భర్తలో మార్పు రాకపోవడంతో ప్రత్యూష ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
భర్త ప్రేమ వ్యవహారం తెలిసి తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురి మృతికి కారణమైన సృజన్‌ను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హసన్‌పర్తి పోలీసులకు (Hasanparthi Police) ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ప్రేమ వ్యవహారం నడిపిన సదరు యువతి ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తించారు.