అక్షరటుడే, భీమ్‌గల్: Doctorate in Zoology | కటిక పేదరికం.. కాలినడకన సాగిన బడిబాట.. తండ్రి మరణంతో పెరిగిన బాధ్యతలు.. ఇవేవీ ఆ యువకుడి లక్ష్యాన్ని అడ్డుకోలేకపోయాయి. పట్టుదలతో చదివి, ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) నుంచి జంతుశాస్త్రంలో డాక్టరేట్ (Ph.D) సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు పిప్రి (జె) గ్రామ పంచాయతీ పరిధిలోని మహాలక్ష్మి తండాకు చెందిన మాలవత్ పూర్ణచందర్.
Doctorate in Zoology | కష్టాల నుంచి కీర్తి శిఖరాలకు..
మాలవత్ దూమా నాయక్ – లింబాయి దంపతుల రెండో కుమారుడైన పూర్ణచందర్ ప్రాథమిక విద్య పిప్రి ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఉన్నత పాఠశాల విద్య కోసం భీమ్‌గల్ (Bheemgal) వరకు కాలినడకన వెళ్లేవారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ విద్యనభ్యసించిన ఆయన, 2004లో డిగ్రీ చదువుతున్న సమయంలో తండ్రిని కోల్పోయారు. కుటుంబ భారమంతా మీద పడినా, వివాహం తర్వాత కూడా పట్టు వదలకుండా బీఈడీ, పీజీ పూర్తి చేశారు. కొంతకాలం లెక్చరర్‌గా పనిచేస్తూనే ఉస్మానియా వర్సిటీలో పీహెచ్‌డీ సీటు సాధించారు.
Doctorate in Zoology | చేపల ఆహారంపై వినూత్న పరిశోధన..
జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ సునీత దేవి పర్యవేక్షణలో ‘కొర్రమీను (Channa Striatus) ఆహారంలో అధిక లిపిడ్ల ప్రభావం – జీవరసాయన మార్పులు’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. చేపల ఆహారంలో మార్పులు చేయడం ద్వారా వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (మంచి కొలెస్ట్రాల్-HDL) పెంచి, గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను (LDL, VLDL) ఎలా తగ్గించవచ్చో తన పరిశోధన ద్వారా నిరూపించారు. ఈ పరిశోధనా ఫలితాల వల్ల చేపల దిగుబడి పెరగడమే కాకుండా, ప్రజారోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పూర్ణచందర్ వివరించారు. ఆయన రాసిన పలు పరిశోధనా వ్యాసాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.
Doctorate in Zoology | అభినందనల జల్లులు..
పూర్ణచందర్ సాధించిన ఈ విజయం పట్ల ప్రొఫెసర్లు మాధవి, జితేందర్ కుమార్ నాయక్, రెడ్యా నాయక్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. పేదరికంలో పుట్టి, కష్టాలను ఓర్చి డాక్టరేట్ సాధించిన పూర్ణచందర్‌ను తండావాసులు, గ్రామస్థులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.