అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indigo Flights | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. వరుసగా నాలుగో రోజూ భారీగా విమాన సర్వీసులను (Flight Services) రద్దు చేసింది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 700లకుపైగా విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీ, బెంగళూరు (Bangalore), హైదరాబాద్ (Hyderabad) సహా దేశంలోని ప్రధాన నగరాల నుంచ బయల్దేరాల్సిన ఫ్లైట్లు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి విమానాశ్రాయాల్లో అవస్థలు పడుతున్నారు. ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. దేశీయ విమానయాన రంగంలో ఇండిగో వాటా 60 శాతం ఉండగా, ఆ ప్రభావం ప్రయాణికుల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Indigo Flights | 20 ఏళ్ల చరిత్రలో తీవ్ర సంక్షోభం..
సిబ్బంది కొరత, డీజీసీఏ కఠిన నిబంధనలు, ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇండిగో తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. తన 20 సంవత్సరాల చరిత్రలో ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) అత్యంత దారుణమైన కార్యాచరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే ఆ సంస్థ నాలుగు రోజులుగా విమాన సర్వీసులను రద్దు చేస్తూ వస్తోంది. తాజాగా ఢిల్లీ నుండి బయలుదేరే అన్ని దేశీయ ఇండిగో విమానాలు అర్ధరాత్రి వరకు రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు ప్రకటించాయి. ఈ చర్య ఇండిగో నెట్‌వర్క్‌లో నాలుగు రోజులుగా కొనసాగుతున్న గందరగోళాన్ని ఎత్తిచూపుతోంది. శుక్రవారం ఒక్కరోజే 700 కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఇప్పటిదాకా రద్దయిన జాబితాలోకి వెయ్యికి పైగా సర్వీసులు చేరాయి. ఫలితంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు.
Indigo Flights | టికెట్ల ధరలకు రెక్కలు..
ఇండిగో సర్వీసుల రద్దు కారణంగా విమానాల టికెట్ల ధరలు రెట్టింపయ్యాయి. ఇండిగో విమానాలు అందుబాటులో లేకుండా పోవడంతో ప్రత్యర్థి విమానయాన సంస్థలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆయా సంస్థలు టికెట్ల రేట్లను పెంచేశాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రూట్‌లో రూ.3 వేలు ఉంటే, ప్రస్తుతం రూ.7 వేలకే పైగా పెరిగింది. అలాగే, మిగిలిన ప్రధాన నగరాల రూట్లలోనూ టికెట్ రేట్లు భారీగా పెరిగాయి.
Indigo Flights | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో గందరగోళం
ఇండిగో శుక్రవారం కూడా తన విమానాలను రద్దు చేసింది. ఢిల్లీ నుంచి వివిధ నగరాలకు వెళ్లే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport)లో తీవ్ర గందరగోళం నెలకొంది. సాధారణంగా రాజధాని నుండి రోజుకు 235 ఇండిగో విమానాలు రాకపోకలు సాగిస్తాయి. అవన్నీ కూడా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. చివరి నిమిషంలో విమానాలు రద్దు చేయడంతో గంటల తరబడి ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. ఇతర విమానాల్లో వెళ్దామాన్నా సీట్లు దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముంబై విమానాశ్రయం (Mumbai Airport) బయల్దేరాల్సిన 32 విమానాలను ఇండిగో రద్దు చేసింది.
