అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indigo Flights | ఇండిగో విమానాల రద్దు (IndiGo flight cancellations) కొనసాగుతోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం ఆరో రోజుకు చేరడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం సైతం దేశవ్యాప్తంగా అనేక ఫ్లైట్లను ఇండిగో రద్దు చేసింది.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Hyderabad Rajiv Gandhi International Airport)(RGIA)లో ఆదివారం 115 ఇండిగో సర్వీసులు రద్దు అయ్యాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన 54 విమానాలు, శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 61 విమానాలు రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 3 మరియు 7 మధ్య రద్దు చేయబడిన మొత్తం విమానాల సంఖ్య 519కి చేరుకుంది. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో డిసెంబర్ 3న 31, 4న 74, 5న 155, 6న 144, 7న 115 విమానాలు రద్దు అయ్యాయి.
Indigo Flights | ఇండిగో చర్యలు
సంక్షోభం నుంచి బయట పడటానికి ఇండిగో చర్యలు చేపట్టింది. క్రమంగా పరిస్థితి మెరుగు పడుతుందని సంస్థ ప్రకటించింది. రద్దు అయ్యే విమానాల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు చెప్పింది. త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే విమానాల రద్దుతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శబరిమలకు వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు (Ayyappa devotees) ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు. రద్దు అయ్యే విమానాల వివరాలు ముందుగానే ప్రకటించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
