అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indigo Flights | దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. విమానాల రద్దు ఏడో రోజుకు చేరింది. అయితే పరిస్థితి కొంత మేర అదుపులోకి వచ్చింది.
ఇండిగో ఇయిర్లైన్స్ (Indigo Airlines) సోమవారం దాదాపు 450 సర్వీసులను రద్దు చేసింది. హైదరాబాద్ (Hyderabad)లో 112, ఢిల్లీలో 134, తమిళనాడులో 71, బెంగళూరులో 127 విమానాలు రద్దు అయ్యాయి. నిన్న, మొన్నటితో పోలీస్తే విమానాల రద్దు సంఖ్య తగ్గింది. అయినా కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్‌పోర్టులు (Airports) రైల్వే స్టేషన్లను తలపిస్తున్నాయి. నిన్నటి వరకు దాదాపు 2 వేల విమానాలు రద్దు అయ్యాయి. లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు కాగా.. విచారణకు న్యాయస్థానం నిరాకరించింది. సకాలంలో చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది.
Indigo Flights | రూ.610 కోట్లు రీఫండ్
విమానాలు రద్దు అయిన వారికి ఇండిగో టికెట్ డబ్బులను రీఫండ్ చేస్తోంది. వందశాతం టికెట్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని సంస్థ గతంలోనే ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటి వరకు రూ.610 కోట్లను ప్రయాణికులకు చెల్లించింది. ఆదివారం, ఎయిర్‌లైన్ తన షెడ్యూల్ చేసిన 2,300 దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలలో దాదాపు 1,650 విమానాలను నడిపింది, 650 రద్దు చేయబడ్డాయి. డిసెంబర్ 5 నుంచి 15 మధ్య ప్రయాణానికి రద్దు చేయబడిన అన్ని బుకింగ్‌లకు ఆటోమేటిక్ రీఫండ్‌లను, రీషెడ్యూలింగ్ ఛార్జీలపై పూర్తి మినహాయింపును ఇండిగో ప్రకటించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) డిసెంబర్ 6న ఇండిగోకు షోకాజ్ నోటీసులు (Showcause Notices) జారీ చేసింది. వివరణ ఇవ్వడానికి సమయం కావాలని ఇండిగో కోరింది.