అక్షరటుడే, వెబ్‌డెస్క్ : World Cup | ఇండియా – పాకిస్థాన్ క్రికెట్ అంటే ఎప్పుడూ హై వోల్టేజ్ డ్రామా, ఎమోషన్స్, ఉత్కంఠ. అయితే ఈ మధ్య జరిగిన ఆసియా కప్ (Asia Cup)లో జరిగిన పరిణామాలు మరింత ఉద్రిక్తత పెంచాయి. పురుషుల జట్ల మధ్య మాటల యుద్ధం, పరస్పర దూషణల వాతావరణం నెలకొన్న నేపథ్యంగా, ఈసారి మహిళా జట్ల పోరులో ఇటువంటి పరిణామాలు జరగకుండా ఉండేందుకు బీసీసీఐ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఆదివారం (అక్టోబర్ 6) కొలంబో వేదికగా జరుగనున్న మహిళల వన్డే వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ కోసం భారత్, పాకిస్థాన్ జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ స్పష్టమైన సూచనలు జారీ చేసింది .
World Cup | అవన్నీ క్లియర్..
ఆసియా కప్ సమయంలో పురుషుల జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరగగా, వాటిలో టీమిండియా ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు మ్యాచ్ అనంతరం హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. దీనిపై పాకిస్థాన్ (Pakistan) ఐసీసీకి ఫిర్యాదు చేసినా క్రికెట్ ప్రవర్తన నియమావళిలో హ్యాండ్ షేక్ తప్పనిసరి కాదని స్పష్టం చేస్తూ, వ్యవహారాన్ని క్లోజ్ చేశారు. ఇక ఇదే ఉద్రిక్తత మహిళల మ్యాచ్లోనూ పునరావృతం కాకూడదని భావించిన బీసీసీఐ, తమ మహిళా క్రికెటర్లకు ముందుగానే క్లియర్ సూచనలు ఇచ్చింది. పాక్ ప్లేయర్లతో వ్యక్తిగతంగా టచ్‌లో ఉండవద్దు, హ్యాండ్ షేక్ చేయవద్దు. టీమ్ స్పిరిట్‌తో ఆడటం సరే కానీ, అప్రతిష్టకర సంఘటనలకు తావివ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇండియా (India) వన్డే ప్రపంచకప్‌ను ఆతిథ్యమిస్తూ ఉన్నా, పాకిస్థాన్ జట్టు భద్రతా కారణాలతో భారత్‌లో మ్యాచ్‌లు ఆడటానికి నిరాకరించింది. దీంతో ఇరుదేశాల మధ్య మ్యాచ్‌ల కోసం న్యూట్రల్ వేదికగా శ్రీలంకను ఎంపిక చేశారు. కొలంబోలో ఈ మ్యాచ్ జరగనుండగా, ఇది పాకిస్థాన్‌కు టోర్నీలో తొలి మ్యాచ్ కావడం విశేషం. భారత్ ఇప్పటికే లంకపై గెలుపుతో విజయారంభం చేసింది. ఈ మ్యాచ్‌కి భారీ ప్రేక్షకాభిమానాన్ని ఆశిస్తున్నారు. బీసీసీఐ తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే అవకాశమున్నప్పటికీ, మైదానంలో క్రికెట్ మేనియా మాత్రం ఎక్కడా తగ్గేలా లేదు.