అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Rupee | అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ క్రమంగా బలహీనపడుతోంది. బుధవారం ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 91.69 కి పడిపోయి మరోసారి జీవన కాల కనిష్టాన్ని నమోదు చేసింది. కరెన్సీ విలువను నిలకడగా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. ఇది ఆర్థిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు బలహీనమవుతుండడం ఆందోళనలను మరింత పెంచేస్తోంది.
Indian Rupee | ఎఫ్ఐఐల అమ్మకాల ప్రభావం..
విదేశీ సంస్థాగత మదుపరులు మన మార్కెట్ (Stock Market) నుంచి నిరంతరంగా పెట్టుబడులను ఉపసంహరిస్తుండడం రూపాయి విలువ పతనానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరిస్తూనే ఉన్నారు. గతేడాది జూలైనుంచి వారు ప్రతినెలా నెట్ సెల్లర్లుగానే నిలుస్తున్నారు. జూన్‌లో నికరంగా రూ. 7,488 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన ఎఫఐఐలు.. ఆ తర్వాత ప్రతి నెలలోనూ నికర అమ్మకందారులుగా నిలుస్తున్నారు. జూలైలో రూ. 47,666 కోట్లు, ఆగస్టులో రూ. 46,902 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 35,301 కోట్లు, అక్టోబర్‌లో రూ. 2,346 కోట్లు, నవంబర్‌లో 17,500 కోట్లు, డిసెంబర్‌లో 34,349 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈనెలలో 20వ తేదీ వరకు నికరంగా రూ. 32,253 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు. ఇలా విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండడంతో డాలర్లకు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ పడిపోతోంది.
Indian Rupee | ఆర్థిక అనిశ్చితులు..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) విధిస్తున్న సుంకాలూ రూపాయిపై ప్రభావం చూపుతున్నాయి. ట్రంప్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై సుంకాలు వడ్డిస్తుండడంతో ఈక్విటీ మార్కెట్ ఒత్తిడికి గురవుతోంది. బంగారం, వెండి వంటి వాటివైపు ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు. మనదేశం బంగారం అతిపెద్ద దిగుమతిదారు కావడంతో రూపాయి విలువ తగ్గుతోంది.
ట్రేడ్ డీల్ కుదరకపోవడం..
అమెరికాతో వాణిజ్య ఒప్పందం లేని కొన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటి. ఒప్పందం కోసం చాలాసార్లు చర్చలు జరిగినా.. అవి ఫలవంతం కాలేదు. వాణిజ్య ఒప్పందం లేకపోవడంతో మన దేశ ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధిస్తోంది. అధిక సుంకాల కారణంగా మన కంపెనీలు అమెరికకా మార్కెట్‌లో పోటీ తట్టుకోలేకపోతున్నాయి. ఇదే సమయంలో కరెంట్ ఖాతా లోటు పెరుగుతూ రూపాయిని కోలుకోకుండా చేస్తున్నాయి ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని రూపాయి మరింత పడిపోకుండా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. అంతర్జాతీయ పరిణామాలు రూపాయిని ఒత్తిడికి గురిచేస్తూ రోజుకో జీవన కాల కనిష్టం వైపు తీసుకువెళ్తున్నాయి.