అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Medicine | ఆఫ్ఘనిస్థాన్ ఔషధ రంగంలో దశాబ్దాలుగా కొనసాగిన పాకిస్థాన్ (Pakistan) ప్రాబల్యం క్రమంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు ఆఫ్ఘన్ మార్కెట్‌లో దాదాపు 70 శాతం వాటా పాకిస్థాన్ మందులదే కాగా, ఇప్పుడు ఆ స్థానం వేగంగా భారతీయ ఔషధాలు ఆక్రమిస్తున్నాయి.
సరిహద్దు వివాదాల కారణంగా తాలిబన్ ప్రభుత్వం–పాకిస్థాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారడం, అదే సమయంలో భారత మందులు నాణ్యతతో పాటు తక్కువ ధరకు లభించడమే ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
Indian Medicine | సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వాస్తవం
ఈ పరిణామాన్ని తాజాగా ఒక ఆఫ్ఘన్ వ్లాగర్ తన వీడియో ద్వారా బయటకు తీసుకొచ్చాడు. గతంలో పాకిస్థాన్ లేదా టర్కీ నుంచి దిగుమతి చేసుకునే సాధారణ పారాసిటమాల్ (Paracetamol) మాత్రలకు 40 ఆఫ్ఘనీలు ఖర్చు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు అదే ఔషధం భారత కంపెనీల నుంచి కేవలం 10 ఆఫ్ఘనీలకే దొరుకుతోందని ఆయన వివరించాడు. ధరల తేడాతో పాటు, భారత మందులు త్వరగా పనిచేస్తున్నాయన్న నమ్మకం కూడా స్థానిక ప్రజల్లో బలంగా పెరిగిందని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ మారుతున్న పరిస్థితుల్లో ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వం భారత్‌తో వైద్య రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఈ క్రమంలోనే భారత ఫార్మా దిగ్గజం జైడస్ లైఫ్‌సైన్సెస్, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రౌఫీ గ్లోబల్ గ్రూప్‌తో సుమారు 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.830 కోట్లు) విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి మందుల సరఫరాతో పాటు, భవిష్యత్తులో ఆఫ్ఘనిస్థాన్‌లోనే (Afghanistan) ఔషధ తయారీ యూనిట్ల ఏర్పాటు కోసం భారత సాంకేతిక సహాయం అందనుంది.
సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి వచ్చే మందులపై తాలిబన్ ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి నాటికి ఈ దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలనే డెడ్‌లైన్ కూడా విధించడంతో పాక్ ఫార్మా పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇదే సమయంలో భారత్ (India) ఆఫ్ఘనిస్థాన్‌కు పెద్ద ఎత్తున వైద్య సహాయం అందిస్తోంది. టన్నుల కొద్దీ మందులు, వ్యాక్సిన్లు, అత్యాధునిక మెడికల్ పరికరాలు (Medical Devices) CT స్కాన్ మెషీన్లు సహా కాబూల్‌లోని ఆసుపత్రులకు చేరాయి. తాలిబన్ ప్రభుత్వాన్ని రాజకీయంగా గుర్తించకపోయినా, మానవతా కోణంలో భారత్ అందిస్తున్న ఈ సహాయం ఆఫ్ఘనిస్థాన్‌లో ‘ఇండియా బ్రాండ్’ కు మంచి పేరు తీసుకొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.