అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | భారత్ బెదిరింపులకు తలొగ్గదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. కర్ణాటకలోని ఉడిపి శ్రీ కృష్ణ మఠంలో (Udupi Sri Krishna Math)జరిగిన లక్ష కంఠ గీతా పారాయణంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
దేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలు తొమ్మిది తీర్మానాలు తీసుకోవాలని మోదీ సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్ (Vikasit Bharat) లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు. నీటిని సంరక్షించడం, చెట్లను నాటడం, ఒక పేద వ్యక్తిని ఉద్ధరించడం, స్వదేశీని స్వీకరించడం వంటి తీర్మానాలు చేసుకోవాలన్నారు. లక్ష కంఠ గీతా పారాయణం నిర్వహించినందుకు మఠం పీఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీని మోదీ అభినందించారు.
PM Modi | సుదర్శన చక్ర..
దేశంలో గతంలో ఉగ్రదాడులు (terrorist attacks) జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏమి చేయలేదన్నారు. కానీ ప్రస్తుతం భారత్ ఎవరి ముందు తలవంచదని పేర్కొన్నారు. దేశ రక్షణ విషయంలో తాము ఎన్నటికి వెనకడుగు వేయమని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచం మన సంకల్పాన్ని చూసిందన్నారు. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశంలో సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థను (Sudarshana Chakra protection system) ఏర్పాటు చేయనున్నట్లు మోదీ తెలిపారు. గీతలో శ్రీకృష్ణుడి బోధనలు ప్రతి యుగానికి సంబంధించినవన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని కృష్ణుడు బోధించాడన్నారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’, ‘సర్వజన్ హితయ’ అనే నినాదాలు గీత నుంచి స్ఫూర్తి పొందినవే అని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ప్రస్తావిస్తూ, ధర్మాన్ని రక్షించడంలో చెడును అంతం చేయడం కూడా భాగమని మోదీ అన్నారు. మన సుదర్శన చక్రం దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కృష్ణ మఠాన్ని సందర్శించిన తర్వాత మోదీ అసెంబ్లీ హాల్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయన భగవద్గీతలోని 18వ అధ్యాయం ముగింపు శ్లోకాలను పఠించారు.
