అక్షరటుడే, వెబ్‌డెస్క్: India vs West Indies | ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026) సూపర్-8 దశ చివరి అంకానికి చేరుకుంది. చెన్నైలో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా (Team India), సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
మొదటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా (South Africa) చేతిలో ఓటమి పాలైన భారత జట్టు, రెండో మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని ఆత్మవిశ్వాసాన్ని చాటింది. అయితే గ్రూప్-1 నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా జట్టు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. జింబాబ్వే (Zimbabwe) పోటీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు మిగిలిన ఒక్క స్థానం కోసం భారత్, వెస్టిండీస్ మధ్య తుది సమరం మిగిలింది.
India vs West Indies | రూట్ క్లియర్ చేసిన సౌతాఫ్రికా విజయం
భారత్, వెస్టిండీస్ జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడి చెరో విజయం సాధించి 2 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. దీంతో మార్చి 1న జరిగే ఈ మ్యాచ్ నేరుగా నాకౌట్ తరహాలో మారిపోయింది. ఫిబ్రవరి 26న జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ను ఓడించడం భారత్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత భారత్ జింబాబ్వేపై భారీ స్కోర్ నమోదు చేసి విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో పరిస్థితి మారింది. ఇప్పుడు గెలిచిన జట్టే సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు 4 పాయింట్లు వస్తాయి. ఓడిన జట్టు 2 పాయింట్లతోనే ఆగిపోతుంది. కాబట్టి నెట్ రన్ రేట్ లెక్కలు అవసరం లేకుండానే విజేత సెమీఫైనల్ టికెట్ దక్కించుకుంటుంది.
వెస్టిండీస్ జట్టు తుది మ్యాచ్‌ల్లో ఎప్పుడూ ప్రమాదకరమే. పవర్ హిట్టింగ్‌కు పేరుగాంచిన కరేబియన్ బ్యాటర్లు మ్యాచ్‌ను ఒక్కసారిగా మలుపుతిప్పగలరు. భారత్ కాస్త అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Captain Suryakumar Yadav) నాయకత్వంలో జట్టు సమన్వయంగా ఆడుతోంది. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ లాంటి బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. జింబాబ్వేపై 256 పరుగుల భారీ స్కోరు నమోదు చేయడం జట్టుకు భారీ ఉత్సాహాన్ని ఇచ్చింది. బౌలింగ్ విభాగం కూడా కీలక సమయంలో వికెట్లు తీస్తూ సత్తా చూపుతోంది. ఈ ప్రదర్శన కొనసాగితే వెస్టిండీస్‌ను ఓడించడం సాధ్యమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, గ్రూప్-1 నుంచి రెండో సెమీఫైనలిస్ట్ ఎవరో తేల్చే ఈ ‘సూపర్ సండే’ పోరు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. భారత్ తన జోరు కొనసాగించి సెమీస్ బెర్త్ సాధిస్తుందా? లేక వెస్టిండీస్ సెన్సేషన్ సృష్టిస్తుందా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
