అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs NZ | భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌ను కూడా గెలిస్తే, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఖాయం చేసుకునే అవకాశాన్ని టీమిండియా అందిపుచ్చుకోనుంది.
ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్ పూర్తిస్థాయి బ్యాలెన్స్‌తో కూడిన ప్లేయింగ్ ఎలెవన్‌పై ఫోకస్ పెట్టింది. రెండో వన్డేకు ముందు భారత జట్టుకు చిన్న ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తొలి వన్డేలో బౌలింగ్ సమయంలో అతడికి సైడ్ స్ట్రెయిన్ రావడంతో మెడికల్ టీమ్ విశ్రాంతి సూచించింది. దీంతో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌తో పాటు స్పిన్ ఆప్షన్‌లో ఖాళీ ఏర్పడింది.
IND vs NZ | కొత్త వారికి అవకాశం?
సుందర్ స్థానంలో జట్టులోకి యువ ఆల్‌రౌండర్ ఆయుష్ బదోని వచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతడికి వన్డే అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్‌లో స్థిరత్వం తీసుకురాగలగడం, అవసరమైనప్పుడు ఆఫ్ స్పిన్‌తో బ్రేక్ ఇవ్వగలగడం బదోనికి ఉన్న ప్రధాన బలాలు. రాజ్‌కోట్ పిచ్ (Rajkot Pitch)పై స్పిన్ కీలకంగా మారే అవకాశం ఉండటంతో ఈ ఎంపికపై మేనేజ్‌మెంట్ సానుకూలంగా ఉంది. జట్టులో మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్ లాంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, వారి పాత్రలు భిన్నంగా ఉన్నాయి. రెడ్డి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాగా, ఇప్పటికే భారత జట్టు ముగ్గురు పేసర్లతో కొనసాగుతోంది. జురెల్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ మాత్రమే కావడంతో బౌలింగ్ ఆప్షన్ ఇవ్వలేడు. ఈ కారణాల వల్ల బదోని ఎంపిక జట్టు సమతుల్యతకు అనుకూలంగా మారుతోంది.
మొత్తానికి రెండో వన్డేలో టీమిండియా (Team India) పెద్దగా మార్పులు చేయకుండా అదే కాంబినేషన్‌ను కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. దీని వల్ల మరోసారి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. సిరీస్‌పై పట్టుబిగించాలనే లక్ష్యంతో భారత్ రాజ్‌కోట్ మ్యాచ్‌లో ఎలా ఆడుతుందన్నది ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
IND vs NZ | జట్టు అంచనా:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.