అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Team India | సొంత గడ్డపై టీమిండియా చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్‌లో ఘోర పరాజయం చవి చూసిన భారత జట్టు రెండో టెస్ట్‌లో గెలిచి సిరీస్ లెవల్ చేయాలని భావించింది.
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా (Team India) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక టెస్ట్‌లో భారత బౌలర్లు నిరాశపరిచిన నేపథ్యంలో సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబరుచడంతో దక్షిణాఫ్రికా (South Africa) 489 పరుగులతో ఇన్నింగ్స్‌ను ముగించింది.
Team India | చెత్త ప్రదర్శన
రెండో రోజు చివరిలో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ వికెట్లేమీ కోల్పోకుండా 9 పరుగులు చేసినప్పటికీ, మూడో రోజు ఉదయం ఆట ప్రారంభమైన వెంటనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత్ 65 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. 21.3వ ఓవర్‌లో కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో ఓపెనర్ కెఎల్ రాహుల్ (KL Rahul) (22) ఐడెన్ మార్క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. మరో ఎండ్‌లో ధీమాగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన యశస్వీ జైస్వాల్ 85 బంతుల్లో 50 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నట్టే అనిపించినా, జట్టు స్కోరు 95 వద్ద సైబన్ ఆర్మర్ బౌలింగ్‌లో మార్కో యాన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి 58 పరుగుల వద్ద ఔటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ (Sai Sudarshan) వచ్చిన మరో అవకాశాన్ని నిలబెట్టుకోలేక 15 పరుగులకే ఔటయ్యాడు. వరుస వికెట్లతో జట్టు ఒత్తిడిలో పడిన సమయంలో ఆదుకుంటాడని భావించిన ద్రువ్ జురెల్ అయితే ఖాతా కూడా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. కెప్టెన్ రిషభ్ పంత్ (Captain Rishabh Pant) (7), రవీంద్ర (6), నితీష్ కుమార్ రెడ్డి (10) క్రీజులో నిలబడలేకపోయారు. భారత్ 54 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికా స్కోర్‌తో పోలిస్తే భారత్ ఇంకా 344 పరుగులు వెనుకబడింది. దీంతో ఈ కీలక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్ (21 నాటౌట్), కుల్దీప్ యాదవ్ (2 నాటౌట్) ఉన్నారు. బాల్‌తో రాణించలేకపోయిన వాషింగ్టన్ కనీసం బ్యాట్‌తో అయిన రాణించి భారత్ పరువు కాపాడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
