అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ind vs Pak : ఆసియా కప్ – 2025 ఫైనల్లో పాకిస్తాన్ జట్టును భారత్ చిత్తుగా ఓడించింది. ఈ టోర్నమెంటులో భారత్ చేతిలో పాక్‌కు ఇది మూడోసారి ఓటమి కావడం గమనార్హం.
ఇక భారత ఆటగాళ్లు ఆసియా కప్ టోర్నమెంటులో విజయ దుందుభి మోగించారు. మొదటి నుంచి చక్కని ఆట తీరును కనబర్చుతూ చివరికి టోర్నీ కప్‌ను కైవసం చేసుకున్నారు. మొత్తంగా టీమిండియా తొమ్మిదో ట్రోఫీని కైవసం చేసుకుంది.
టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఆటగాళ్లు 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు.
147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లకు పాక్ జట్టు గట్టిగానే పోటీ ఇచ్చింది. దీంతో ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠంగా సాగింది. ఎట్టకేలకు ఐదు వికెట్ల తేడా ఇండియా జట్టు నిర్ణీత లక్ష్యాన్ని ఛేదించింది.
Ind vs Pak : ఆదుకున్న తిలక్ వర్మ
భారత్ జట్టు బౌలింగ్‌లోకి దిగాక మొదట గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ప్రమాదంలో పడింది. ఆ సమయంలో తిలక్ వర్మ, శివమ్ దూబే ఆదుకున్నారు.
పాక్ బౌలర్లను తిలక్ ఎదుర్కొంటూ జట్టుకు పరుగులు అందించాడు. తిలక్ (69) చివరి వరకు నిలబడి భారత్‌కు విజయం అందించాడు.
శివమ్ దూబే (33) కూడా జట్టుకు అండగా నిలిచాడు. తర్వాత వచ్చిన రింకూ సింగ్ వచ్చి భారత్ విజయానికి దోహదపడ్డాడు.
కుల్దీప్ మంత్రదండం
పాక్ బ్యాటర్లు మొదట భారీగా స్కోర్ చేస్తూ పోయారు. పాక్ ఓపెనర్లు ఫర్హాన్, ఫకర్ జమాన్ నిలకడగా ఆడి 45 పరుగులు చేశారు. ఫర్హాన్ (57) అర్ధ శతకం పూర్తిచేసుకుని వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో తిలక్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఫకర్ (48) కూడా దూకుడుగా ఆడాడు.
దీంతో దాయాది జట్టు దూసుకుపోతున్న తరుణంలో కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. దీంతో అప్పటి వరకు దాయాది జట్టు చేతిలో ఉన్న ఆట భారత్ చేతిలోకి వచ్చింది.
అజేయంగా భారత్
టీమిండియా ఈ టోర్నమెంటుల్ అజేయంగా నిలిచింది. లీగ్‌లో మూడు మ్యాచ్‌లు ఆడింది. సూపర్ 4లో మూడు ఆడింది. ఫైనల్‌తో కలిపి మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడగా.. అన్నింట్లోనూ విజయం సాధించింది.