అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs NZ : భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేలో టీమ్ ఇండియా అభిమానులకు నిరాశ తప్పలేదు. ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించి, సిరీస్‌ను సొంతం చేసుకుంది.
కింగ్ కోహ్లీ Kohli సెంచరీ వృథా అయింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో కివీస్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 300 పరుగులు దాటి పోరాడినా.. వికెట్లు కోల్పోవడంతో పరాజయం తప్పలేదు.
టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన కివీస్ బ్యాటర్లు మైదానంలో చెలరేగిపోయారు. డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) రెచ్చిపోయారు. దీంతో కివీస్337 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు తీసినా, మిడిల్ ఓవర్లలో కివీస్ పరుగులను కట్టడి చేయలేకపోయారు.
338 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు.. ఆరంభంలో ఎదురు దెబ్బలు తగిలాయి. శుభ్‌మన్ గిల్ (23),రోహిత్ శర్మ (11) పవర్‌ప్లేలోనే వెనుదిరిగారు. శ్రేయస్ అయ్యర్ (3), రాహుల్ (1) విఫలమయ్యారు. 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దుస్థితి భారత్ జట్టుది.
IND vs NZ : కోహ్లీ వీరోచిత పోరాటం..
అదే సమయంలో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (124 ).. నితీష్ కుమార్ రెడ్డి (53)తో కలిసి ఇన్నింగ్స్‌ను తన చేతిలోకి తీసుకున్నాడు. నితీష్ ఔట్ అయ్యాక హర్షిత్ రాణా బ్యాటింగ్ చేపట్టి, కేవలం 41 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. కోహ్లీ కూడా తన 54వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్ కొనసాగించినంత సమయం కూడా భారత్ వైపే విజయావకాశాలు కొనసాగాయి.
అయితే కోహ్లీతోపాటు సిరాజ్ కూడా ఔట్ కావడంతో భారత్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. నిర్దేశిత లక్ష్యానికి మరో 41 పరుగులు ఉండగానే టీమిండియా ఆలౌట్ అయింది.