అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | నియోజకవర్గంలోని నాలుగు ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం మంజూరైందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) తెలిపారు. ఈ మేరకు సోమవారం పార్టీ కార్యాలయంలో సంబంధిత ఆలయ పూజారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖతో (Endowments Minister Konda Surekha) మాట్లాడి నాలుగు దేవాలయాలకు దీపదూప నైవేద్య పథకం మంజూరు చేయించినట్లు చెప్పారు. దేవాదాయ శాఖ (Endowments Department) పరిధిలో అనేక ఆలయాలు ఉన్నప్పటికీ అవి దూపదీప నైవేద్యానికి నోచడం లేదన్నారు. వాటికి ఏళ్ల నాటి చరిత్ర ఉన్నా నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయని తెలిపారు.
విశిష్టత కలిగిన ఆలయాలను గుర్తించి నిత్యం పూజలు నిర్వహించేందుకు, అర్చకులకు కనీస వేతనం, ఆలయాల నిర్వహణకు కనీస ఖర్చుల కింద ప్రభుత్వం నెలనెలా నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. ఆలయ పూజారికి రూ.6 వేల చొప్పున, ఆలయ నిర్వహణకు రూ.4 వేల చొప్పున మొత్తం రూ.10వేల పూజారి ఖాతాలో జమ చేయనుందన్నారు.
Shabbir Ali | మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు
మహిళల ఆత్మ గౌరవానికి కోటి చీరలు అందించడం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం ఆయన దోమకొండ మండల కేంద్రంలో నిర్వహించిన మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో (Telangana Pragathi program) పాల్గొన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక ప్రగతి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని తెలిపారు. మహిళ శక్తి తెలంగాణ శక్తి అని అభివృద్ధి యాత్రలో మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
Shabbir Ali | బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోంది..
ఎన్నికల సమయంలో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతుందని షబ్బీర్ అలీ ఆరోపించారు. దోమకొండ మండల (Domakonda Mandal) కేంద్రంలో ఓటు చోరీపై నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ సంతకాల సేకరణ ఉద్యమం ద్వారా ప్రజలు తమ ఓటు హక్కు గురించి చైతన్యవంతులై, రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు.
