అక్షరటుడే, వెబ్డెస్క్ : Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా (Dr. Uzma) కీలక వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.
కొన్ని వారాలుగా ఆయనను ఎవరికీ కలిసేందుకు అధికారులు అనుమతించకపోవడంతో ఆందోళనలు పెరిగిన విషయం తెలిసిందే. చివరకు అనుమతి లభించడంతో మంగళవారం సాయంత్రం 20 నిమిషాలపాటు ఆమె ఆయనతో మాట్లాడారు. ఉజ్మా వెల్లడించిన వివరాల ప్రకారం… “ఇమ్రాన్ బతికే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు… కానీ మానసికపరంగా తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నారు” అని స్పష్టంచేశారు.
Imran Khan | బ్రతికే ఉన్నారు..
రోజంతా సెల్లోనే నిర్బంధించి, చాలా తక్కువ సమయంలో మాత్రమే బయటకు రావడానికి అనుమతిస్తున్నారని చెప్పారు. ఎవరితోనూ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారన్నారు. అలాగే, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ (Pakistan Army Chief General Asim Munir)పై ఇమ్రాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉజ్మా తెలిపారు. మొత్తం సైన్యాన్ని తన నియంత్రణలోకి తీసుకుని, తాను, కొందరు ఉన్నతాధికారులు జీవితాంతం శిక్షల నుంచి మినహాయింపుల కోసం రాజ్యాంగ మార్పులు చేయించుకున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారని చెప్పారు. తన నిర్బంధానికి అసీం మునీర్ ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడుతున్నారని తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై పీటీఐ అనుచరులు (PTI Supporters) పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలులో ఆయనకు కల్పిస్తున్న సౌకర్యాలపై, భద్రతపై అధికారుల నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉందని ఉజ్మా డిమాండ్ చేశారు.అయితే ఇమ్రాన్ చనిపోయాడని రెండు రోజులు వార్తలు వచ్చిన నేపథ్యంలో పీటీఐ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేశారు. ఈ క్రమంలో 144 సెక్షన్ కూడా అమలు చేశారు.
