అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే (Medchal MLA) మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయన శనివారం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. తనకు రాజకీయాలు వద్దని.. కాలేజీలు నడుపుకుంటూ ప్రజా సేవ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పటికే 73 ఏళ్లు వచ్చాయని.. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు చూసిన అని పేర్కొన్నారు. తనకు ఇప్పుడు వేరే పార్టీ వైపు చూడాల్సిన అవసరం లేదన్నారు.
మేడ్చల్ జిల్లాలోని కొంపల్లి, దుండిగల్, మైసమ్మగూడ, సూరారాం ప్రాంతంలో మల్లారెడ్డి (Mallareddy)కి ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆయన టీడీపీ (TDP) నుంచి 2014లో ఎంపీగా గెలిచారు. అనంతరం 2016లో ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) నుంచి మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయ్యారు. 2023 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. అనుమతులు లేవని ఆయనకు చెందిన పలు కాలేజీ భవనాలు కూల్చి వేశారు. ఈ క్రమంలో తాజాగా ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు మల్లారెడ్డి తన మాస్ డైలాగ్‌లతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
Mallareddy | పొలిటిక్స్‌కు గుడ్‌బై చెబుతారా..
మల్లారెడ్డి మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం బీఆర్ఎస్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. బీజేపీ, టీడీపీ వైపు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అయితే కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం ఆయన బీజేపీ(BJP)లో చేరనున్నారు. మరికొంత మంది మాజీ ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్ను వీడనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఆయన కోడలు ప్రీతిరెడ్డి రాజకీయాల్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. బోనాల సందర్భంగా ఆమె బీజేపీ నేతలతో భేటీ అయ్యారు.